మండలి విషయంలో జగన్ సర్కారు రివర్స్ గేర్

మండలి రద్దు తీర్మానం వెనక్కి..సభ ఆమోదం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో రివర్స్ గేర్ వేశారు. మండలి రద్దుపై వెనక్కు తగ్గారు. మండలి వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని అసెంబ్లీ వేదికగా ప్రకటించి ఇప్పుడు అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలోనే అన్ని రంగాల నిపుణులు ఉన్నారని..లాయర్లు, జర్నలిస్టులు..డాక్టర్లు, ఇంజనీర్లు ఇలా అనేక మంది నిపుణులు శాసనసభలోనే ఉన్నందున శాసనమండలి అవసరం లేదని జగన్ మండలి రద్దు సందర్భంగా గత ఏడాది జనవరి 27న ప్రకటించారు. కేంద్రానికి మండలి రద్దు తీర్మానం పంపారు కానీ..దీని గురించి పెద్దగా ఫాలో అప్ చేసింది లేదు. ఇప్పుడు మండలిలో వైసీపీకి మెజారిటీ రావటంతో ఏకంగా మండలి రద్దు నిర్ణయాన్నే వెనక్కి తీసుకున్నారు.
ఈ మేరకు శాసనసభ తీర్మానాన్ని మంగళవారం నాడు ఆమోదించింది. ఏపీ ఆర్ధిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. కేంద్రం ఆమోదం లభించకపోవటంతో ఇన్ని రోజులు దీనిపై సందిగ్ధత నెలకొందని..ఇప్పుడు మండలిని కొనసాగించాలని నిర్ణయించామని సభకు తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న సభ్యులే ఎక్కడైనా సుప్రీం అని..అయితే సూచనలు, సలహాలు ఇవ్వటానికి మండలి ఏర్పాటు చేశారన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అసలు శాసనమండలే లేదన్నారు. ప్రజల కోసం మంచి చట్టాలు తేవాలన్నా..సవరించాలన్నా ఆ అధికారం శాసనసభకే ఉందన్నారు. కొత్త, పాత శాసన మండలి సభ్యులు మరింత ఉత్సాహంతో పనిచేసేలా మండలిని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఇటీవలే వెనకబడిన వర్గాలకు చెందిన వ్యక్తికి మండలి ఛైర్మన్ పదవికి కూడా ఇచ్చామన్నారు.