Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు ఇప్పటిలో బయటకు రావటం కష్టమా?

చంద్రబాబు ఇప్పటిలో బయటకు రావటం కష్టమా?
X

వచ్చే ఎన్నికలే లక్ష్యమా?. అవినీతి కంటే అసలు కథ రాజకీయమేనా? గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే రాజకీయ వర్గాలతో పాటు అధికార వర్గాల్లో వస్తున్న అనుమానాలు ఇవి. అంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారా?. తెలుగు దేశం అధినేత, చంద్రబాబు నాయుడు ను వరస కేసు లో ఉక్కిరిబిక్కిరి చేసి తెలుగు దేశం పార్టీ ని దారుణంగా దెబ్బ తీసే వ్యూహం అధికార వైసీపీ పన్నినట్లు స్పష్టంగా కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో చంద్ర బాబు ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు రిమాండ్ కు పంపటంతో అయన గత పది రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు లో ఈ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కు సంబంధించి దాఖలు అయిన క్వాష్ పిటిషన్ పై వాదనలు పూర్తి అయ్యాయి. జడ్జిమెంట్ రిజర్వు లో పెట్టారు. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కు సంబంధించి పీటి వారంట్ దాఖలు చేశారు. చంద్రబాబు లాయర్లు రింగ్ రోడ్ కేసు కు సంబంధించి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు సిఐడి అధికారులు ఫైబర్ నెట్ కేసు లో మరో పీటి వారంట్ దాఖలు చేశారు. ఇలా జగన్ సర్కారు వరస పెట్టి పాత కేసులు అన్నింటిని ఇప్పుడు తెరపైకి తెచ్చి పీటి వారంట్స్ దాఖలు చేస్తుండంతో ప్రభుత్వం అసలు లక్ష్యం ఏమిటో స్పష్టంగా తెలిసిపోతుంది అని ఒక ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు లో పూర్తిగా మెరిట్ ఆధారంగానే చంద్రబాబు ను అరెస్ట్ చేశాం తప్ప తమకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు, కక్షలు లేవు అంటూ ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు.

ఆ తర్వాత వరసగా చోటు చేసుకొంటున్న పరిణామాలు చూస్తుంటే...చంద్రబాబు ను ఎంత ఎక్కువ కాలం వీలు అయితే అంత ఎక్కువ కాలం జైలు కు పరిమితం చేసే దిశగానే వ్యవహారం సాగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తొలి కేసు అంటే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం విషయంలోనే ప్రజల్లో టీడీపీ చెపుతున్న లెక్కలకు, ప్రభుత్వ వాదనకు మధ్య తేడాపై విస్తృత చర్చ సాగుతోంది. ఈ తరుణంలో ఇప్పుడు కొత్త కేసు లు తెచ్చి పీటి వారెంట్లు వేస్తుండంతో ఇది పూర్తి రాజకీయ టార్గెట్ గా చేస్తున్నారు అనే అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉంది అనే చర్చ వైసీపీ నేతల్లో కూడా సాగుతోంది. ఎన్నికల ముందు ఈ ప్రయోగాలు ఎవరిని ముంచి..ఎవరిని బయట పడేస్తాయో అనే లెక్కలు వేసుకుంటున్నారు రాజకీయ నేతలు. అయితే అధికార వైసీపీ మాత్రం ఎంత ఎక్కువ కాలం వీలు అయితే అన్ని ఎక్కువ రోజులు చంద్రబాబు ను జైలు కి పరిమితం చేసి దెబ్బ కొట్టడమే అసలు ఎజెండాగా ఉన్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని వైసీపీ కి చెందిన ఒక సీనియర్ నేత కూడా అభిప్రాయపడ్డారు. అటు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం అయినా...ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసు ల్లో మెరిట్స్ తేల్చాల్సింది కోర్ట్ లే. కానీ ఈ లోగా జరిగే రాజకీయ పరిణామాలు ఎవరికీ మేలు చేస్తాయి...ఎవరికీ నష్టం చేస్తాయనే చర్చ సాగుతోంది. అదే సమయంలో జగన్ సర్కారు అసలు ఎజెండా కూడా బయట పడింది అని చెపుతున్నారు.

Next Story
Share it