రాజధాని రైతులతో ‘జగన్ సర్కారు ఆటలు’
ప్రభుత్వం ఒక పరిశ్రమ ఏర్పాటుకు వంద ఎకరాల భూమి కేటాయిస్తే భూమి పొందిన కంపెనీ అక్కడ పరిశ్రమే పెట్టాలి. అలా కాకుండా నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటా...లేక పోతే మరో వ్యాపారం చేసుకుంటా అంటే నిబంధనలు అనుమతించవు. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం నుంచి దారి మళ్లితే ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే రాజధాని రైతులతో ఆటలు ఆడుకుంటోంది. గత ప్రభుత్వం ఏమైనా తప్పులు చేసినట్లు ఆధారాలు ఉంటే వారిపై చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ తప్పుపట్టారు. రాజధాని అమరావతి కోసం అని గత ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి 33 వేల ఎకరాలు పైనే సమీకరించింది. కచ్చితంగా ఆ భూమిని రాజధాని...దాని అనుబంధ అవసరాలు...తర్వాత కొంత మొత్తం ఇళ్ల స్థలాలకు కేటాయించుకోవచ్చు. చంద్రబాబు హయాంలో అనుకున్న తరహాలో రాజధాని పనులు ముందుకు సాగలేదు. ప్రతిపక్షంలో ఉండగా అమరావతి కి జై కొట్టిన జగన్ సీఎం అయిన తర్వాత మూడు రాజధానులు అని మాట మార్చారు. ఈ విషయం ఇప్పుడు కోర్ట్ లో ఉంది. రైతుల దగ్గర నుంచి ప్రధానంగా ఏ ఉద్దేశం కోసం భూ సమీకరణ చేశారో అది అసలు నెరవేరలేదు. ఎప్పటికి నెరవేరుతుందో తెలియదు. సీఎం జగన్ అయితే అమరావతిలో కేవలం అసెంబ్లీ మాత్రమే అని తేల్చేశారు. అంటే భూ సమీకరణ చేసిన సమయంలో చెప్పిన మాటల నుంచి ప్రభుత్వం పక్కకు జరిగింది. ఇక్కడ సర్కారు తీరు ఎలా ఉంది అంటే మల్టీప్లెక్స్ కడతామని తీసుకుని ...డొక్కు హాల్ తో సరిపెట్టి మిగిలిన భూమిని తనకు ఇష్టం వచ్చినట్లు వాడుకుంటామని చెపుతున్నట్లు ఉంది అని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.
నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునే ప్రభుత్వం..అమరావతి లో అసలు ప్రతిపాదిత రాజధాని కట్టేదే లేదు అని తేల్చేసి..దాని కోసం తీసుకున్న భూములను మాత్రం తమ ఇష్టం వచ్చినట్లు వాడుకుంటాం అని చెపుతోంది. అదే మంటే ప్రతిపక్షాలు...రైతులు పేదలకు ఇళ్ళు ఇస్తామంటే అడ్డుకుంటున్నారు అంటూ విమర్శలు గుప్పిస్తోంది. ఏకంగా ప్రభుత్వమే అసలు ఏ లక్ష్యం కోసం అయితే భూములు తీసుకున్నారో దాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా కేవలం రాజకీయం కోసమే పేదలకు ఇళ్ల స్థలాలు పేరుతో రచ్చ చేస్తోంది అని అధికారులు కూడా విమర్శిస్తున్నారు. ఆర్ -5 జోన్‌పై అమరావతి రైతులు వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఆర్-5జోన్ ఏర్పాటు, ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను నిలిపివేయాలంటూ రాజధాని రైతులు మధ్యంతర ఉత్తర్వులు కోరారు. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సీజే ధర్మాసనం నిరాకరించింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు తుది తీర్పునకు లోబడి ఉండాలని హైకోర్టు తెలిపింది. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం అభివృద్ధి చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్‌ను ఆర్ - 5జోన్‌గా మార్చి పేదలకు ఇళ్ల స్థలాల కోసం 1134 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. హై కోర్ట్ నిర్ణయంతో జగన్ సర్కారు ఇప్పుడు శరవేగంగా పావులు కదుపుతోంది. ప్రతిపక్షం లో ఉండగా అమరావతి రైతుల తో పాటు భోగాపురం రైతులపై ప్రేమ కురిపించిన జగన్ ఇప్పుడు వారితో ఆడుకుంటున్నారు అనే విమర్శలు మూట కట్టుకుంటున్నారు.