Telugu Gateway
Andhra Pradesh

ఎన్నికల ముందు ఉద్యోగులకు మరో ఝలక్ !

ఎన్నికల ముందు ఉద్యోగులకు మరో ఝలక్ !
X

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులతో చెడుగుడు ఆడుతున్న ఆంధ్ర ప్రదేశ్ లోని జగన్ సర్కారు మరో షాక్ ఇవ్వటానికి సిద్ధం అయినట్లు సమాచారం. ఉద్యోగులకు ఎప్పటి నుంచో అమల్లో ఉన్న లీవ్ ఎన్ క్యాష్ మెంట్ సౌకర్యాన్ని రద్దు చేసే దిశగా సర్కారు ఆలోచిస్తోంది. ఇప్పటికి దీనికి సంబంధించి ఆర్థిక శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆ శాఖకు చెందిన అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. లీవ్ ఎన్ క్యాష్ మెంట్ కింద ప్రతి ఏటా ఉద్యోగులు తమకు వచ్చే 30 రోజుల ఆర్జిత సెలవుల్లో పదిహేను రోజుల సెలవులను నగదుగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా జగన్ సర్కారు దీన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయటం లేదు. అరకొరగా కొంత మందికి మాత్రం ఈ వెసులుబాటు కల్పించి పెద్ద సంఖ్యలో లీవ్ ఎన్ క్యాష్ మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతిపాదనలను పక్కన పెట్టేశారు అని ఉద్యోగులు చెపుతున్నారు. ఇప్పుడు ఏకంగా లీవ్ ఎన్ క్యాష్ మెంట్ సౌకర్యం రద్దు దిశగా ఆర్థిక శాఖ ముందుకు సాగుతున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఒక వైపు సకాలంలో వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్న సర్కారు ఇప్పుడు వాళ్లకు ఎప్పటి నుంచో ఉన్న లీవ్ ఎన్ క్యాష్ మెంట్ సౌకర్యాన్ని కూడా రద్దు చేయాలని ఆలోచించటం దుమారం రేపే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా దీనికి సంబదించిన దరఖాస్తులు పెండింగ్ లో ఉండటం...ఎప్పటికప్పుడు కొత్తగా మళ్ళీ వచ్చే అవకాశం ఉండటంతో ఆర్థిక శాఖ ఈ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెపుతున్నారు.

ఎన్నికలకు ముందు అంటే జగన్ ప్రతిపక్షంలో ఉండగా ప్రభుత్వ ఉద్యోగులపై ఎక్కడ లేని ప్రేమ కురిపించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాపీగా అబ్బే...అప్పుడు ఏదో తెలియక చెప్పాము..ఇంత భారం ఉంటది అని తెలియదు అంటూ సజ్జల తో తర్వాత చెప్పించిన విషయం అందరూ చూసిందే. ఇప్పటికే ఉద్యోగులకు పలు డీఏ లు పెండింగ్ లో ఉన్నాయి. చేసిన పనికి సకాలంలో జీతాలు కూడా ఇవ్వని సర్కారు ఇప్పుడు ఏకంగా ఎప్పటి నుంచో ఉద్యోగులకు ఉన్న సౌకర్యాలు అన్నిటికి ఇలా కోతలు పెడుతూ వస్తోంది. ఆర్థిక శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనల ప్రకారం ఎన్నికల ముందు లీవ్ ఎన్ క్యాష్ మెంట్ రద్దు ప్రతిపాదన ను అమలు చేస్తే మరిన్ని చిక్కులు తప్పవనే అభిప్రాయాన్ని కొంత మంది అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మరి కొంత మంది మాత్రం ఏమి చేసినా ప్రభుత్వ ఉద్యోగులు ఎలాగూ అధికార వైసీపీ వైపు చూసే అవకాశం లేదు అని..అందుకే సర్కారు కూడా సాధ్యమైంతమేర వాళ్లకు వచ్చే సౌకరాల్లో కోత పెట్టి వాటిని తన అవసరాల కోసం వాడుకోవాలి అనే ఆలోచనలో ఉంది అని చెపుతున్నారు.

Next Story
Share it