Telugu Gateway
Andhra Pradesh

అంతా ఒక ప్లాన్ ప్రకారమే

అంతా ఒక ప్లాన్ ప్రకారమే
X

ముఖ్యమంత్రి అంటే రాష్ట్రం అంతటికి. అంతే కానీ...ఏదో కొన్ని వర్గాలకు...కొంత మంది లబ్దిదారులకు మాత్రమే కాదు. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ రాష్ట్రానికి తాను చేసినట్లు ఎవరూ మేలు చేయలేదు అనే మాట చెప్పకుండా ....తన పాలనలో మీ మీ కుటుంబాలకు మంచి జరిగిందా లేదా అలోచించి ఓటు వేయండి..మీరే నా కోసం బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి అని గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న బస్ యాత్ర...మేమంతా సిద్ధం సభల్లో చెపుతూ వస్తున్నారు. అంటే జగన్ ఈ డీబిటి ని ఒక పథకం ప్రకారం రాష్ట్రంలో తన ఓటు బ్యాంకు ను సుస్థిరం చేసుకోవటం కోసం, రాజకీయ అవసరాల కోసం వాడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పేదలకు..అర్హులకు సాయం చేయటాన్ని ఎవరూ తప్పుపట్టారు. కానీ పన్నుల ద్వారా వచ్చిన నిధులను...అప్పులు చేసిన మొత్తాలను ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వకుండా, రహదారులకు కనీస మరమ్మత్తులు చేయకుండా వదిలేసిన విషయం తెలిసిందే. ఈ ఐదేళ్లలో ఒక ఎజెండా ప్రకారం రాజకీయ కోణంలోనే ఖర్చు చేసినట్లు జగన్ మాటలు చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే అయన తన బహిరంగ సభల్లో ఎక్కడా రాష్ట్ర అభివృద్ధి కోసం...రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసినట్లు చెప్పకుండా...తాను ఈ ఐదేళ్లలో డీబిటి ద్వారా దగ్గర దగ్గర 2 .75 లక్షల కోట్ల రూపాయల మేర ప్రజలకు పంపిణి చేసినట్లు చెపుతూ వస్తున్నారు. జగన్ తన ఎన్నికల ప్రచారంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో కీలకం అయిన పోలవరం ప్రాజెక్ట్ ఊసే ఎత్తడం లేదు.

ప్రతిపక్షంలో ఉండగా జగన్ ఇదే పోలవరం గురించి చెప్పిన మాటలు అన్ని ఇన్ని కావు. అవసరం అయితే రాష్ట్ర సొంత వనరులతో ప్రాజెక్ట్ పూర్తి చేయాలనీ డిమాండ్ చేశారు ప్రతిపక్షంలో ఉండగా. కానీ ఐదేళ్లలో ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగింది ఎంతో తక్కువే అని చెప్పక తప్పదు. మళ్ళీ గెలిపించమని అడుగుతున్న జగన్ తర్వాత అయినా పోలవరం పూర్తి చేస్తానని చెపుతున్నారా అంటే అదీ లేదు. తాను ఓడిపోతే పేదలకు ఇప్పుడు అందుతున్న మొత్తలు రావు అనే ప్రచారమే చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మళ్ళీ తానే గెలవాలి అని చెపుతున్నారు. అంటే జగన్ ఎజెండా ఏంటి అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఒక వ్యక్తికి మూడు ఇళ్ళు ఉంటే ఎలా ఉంటుందో ..ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే కూడా అలాగే ఉంటుంది అని చెప్పొచ్చు. అమరావతిని జగన్ అటకెక్కించింది రాజకీయ కారణాలతోనే తప్ప...మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం అనే వాదన పూర్తిగా డొల్ల అనే విషయం తెలిసిందే. జగన్ అయినా...మరొకరు అయినా అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినా ఎవరూ అడ్డుకోరు.

చేయాలనే చిత్తశుద్ధి నాయకులకు ఉండాలి అంతే. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా వస్తే అసలు పరిశ్రమలు వాటంతట అవే పరుగులు పెట్టుకుంటూ వస్తాయని చెప్పిన జగన్..గత ఎన్నికల్లో 22 మంది ఎంపీలను గెలిపించినా ఈ విషయం లో చేసింది జీరో. ఢిల్లీ వెళ్ళినప్పుడు అలా ప్రతి సారి ఒక కాయితం ఇచ్చిరావటం తప్ప చేసింది ఏమి లేదు. అంతకు మించి ఏమి చేయలేము అనే విషయాన్నీ కూడా అయన బహిరంగంగానే చెప్పారు. అందుకే గత ఎన్నికల్లో తన గెలుపుకు ఒక అస్త్రంగా వాడుకున్న ప్రత్యేక హోదా విషయాన్నీ జగన్ ఇప్పుడు ఎక్కడా ప్రస్తావించే ప్రయత్నమే చేయటం లేదు. చివరకు సొంత జిల్లా కడప స్టీల్ ప్లాంట్ విషయంలోనే అదే పరిస్థితి. ఇప్పటికే రెండు సార్లు కడప స్టీల్ కు శంకుస్థాపన చేశారు కానీ...ప్రాజెక్ట్ లో ఇప్పటికి పెద్దగా పురోగతి లేదు. మళ్ళీ గెలిచినా తన ఎజెండా ఎలా ఉండబోతుందో జగన్ తన ప్రతి మీటింగ్ లో చెపుతున్నారు. మరి ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లు మే 13 న ఎలాంటి తీర్పు ఇస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it