అమరావతి పై జగన్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి లో ఇప్పటికే అరవై వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచింది. ఇప్పుడిప్పుడే అమరావతి లో పనుల వేగం పెరుగుతోంది. మరో వైపు ఇది సాగుతున్న తరుణంలోనే ప్రభుత్వం రాజధాని రెండవ దశ కోసం ఇప్పుడు 16000 ఎకరాలు పైనే సేకరించేందుకు రెడీ అయింది. తర్వాత ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. వాస్తవానికి రెండవ దశలో దగ్గర దగ్గర 44 వేల ఎకరాలు సమీకరించాలని ప్రతిపాదించారు. తర్వాత ఇందులో కొన్ని మార్పులు చేశారు. ఈ దశలో వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజధాని అమరావతి తో పాటు రెండవ దశ భూ సమీకరణ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన అమరావతి విషయంలో తన వ్యతిరేక స్టాండ్ ఏమి మార్చుకోలేదు అని స్పష్టం అవుతోంది. అంతే కాదు..ఏకంగా ఇప్పుడు అమరావతి నిర్మాణాలు రివర్ బేసిన్ లో జరుగుతున్నాయి అని..వీటిపై సుప్రీం కోర్ట్ కూడా దృష్టి సారించాలని కోరటం అన్నది ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది అనే చెప్పాలి.
ఒక వైపు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పార్లమెంట్ లో చట్ట సవరణ ద్వారా అమరావతి కి చట్టబద్దత తెచ్చే విషయంలో ప్రయత్నాలు వేగవంతం చేసిన తరుణంలో జగన్ మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రెండవ దశ పేరుతో ఇప్పుడు మళ్ళీ భూ సమీకరణ చేయటం చంద్రబాబు చేస్తున్న పిచ్చి పని అని జగన్ వ్యాఖ్యానించారు. తొలి దశ రాజధాని పనులు పూర్తి కాకుండానే ఇప్పుడు మళ్ళీ రెండవ దశ అనటం ఏ మాత్రం సరికాదు అన్నారు. తొలి దశ రాజధానికి భూములు ఇచ్చిన రైతులే ఇంకా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని...వాళ్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా పూర్తి చేయలేదు అని జగన్ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను, తన బినామీలు దోచుకోవడానికి అదనపు భూ సమీకరణ చేస్తున్నారు అని ఆరోపించారు. సీఎం ఎక్కడ నుంచి పని చేస్తే అదే రాజధాని అని....అసలు రాజధాని అన్నదే రాజ్యాంగంలో లేదు అని జగన్ వ్యాఖ్యానించారు.
తొలి దశ భూ సమీకరణ సమయంలోనే రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలకు ఎకరాకు రెండు కోట్ల రూపాయల వ్యయం అవుతుంది అని చెప్పారు అని...మరి తొలిదశలో సేకరించిన 50 వేల ఎకరాలకు అయ్యే లక్ష కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి వస్తాయో తెలియదు అన్నారు. రాజధాని విజవాడ -గుంటూరు మధ్య కట్టి ఉంటే బాగుండేది అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తొలి దశ రాజధాని ఒక షేప్ కు రాకముందే గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, గ్రీన్ ఇండస్ట్రీస్ కోసం అంటూ రెండవ దశ భూ సమీకరణ తలపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే రైతుల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలతో అమరావతి రైతులు ఎలా స్పందిస్తారో చూడాలి.
రాజధాని అమరావతి పై జగన్ చేసిన విమర్శలపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పందించారు. జగన్ ఇలాగే మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో ఆ పదకొండు సీట్లు కూడా జీరో అవుతాయన్నారు. రాజధాని నదీ గర్భంలో కడుతున్నామనేది దుష్ప్రచారమే అన్నారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ రాజధాని అమరావతికి అనుకూలంగా మాట్లాడిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. రాజధాని మాస్టర్ ప్లాన్ పై జగన్ ఏ మాత్రం అవగాహనా లేకుండా మాట్లాడుతున్నారు అని నారాయణ విమర్శించారు. టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ హయాంలో పక్కన పెట్టిన పనులు అన్నిటిని ప్రారంభించాం అని తెలిపారు.



