Telugu Gateway
Andhra Pradesh

ఏదైనా ..ఇక ఎన్నికల తర్వాతే

ఏదైనా ..ఇక ఎన్నికల తర్వాతే
X

ఎన్ని ముహుర్తాలు మార్చారో. ఎన్ని కొత్త తేదీలు ప్రకటించారో. కానీ ఏదీ అమలు కాలేదు. పారిశ్రామిక వేత్తల సదస్సు దగ్గర నుంచి పలు సమావేశాల్లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాను వైజాగ్ కు షిఫ్ట్ అవుతున్నట్లు ప్రకటించారు. క్యాబినెట్ సమావేశాల్లో కూడా మంత్రులకు జగన్ ఈ మాట చెప్పారు. ఎవరి దగ్గర చెప్పినా... ఎన్ని సార్లు చెప్పినా కూడా వైజాగ్ కు షిఫ్ట్ కావాలనే జగన్ కల మాత్రం నెరవేరలేదు. మరో పది రోజుల్లోనే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ తో పాటు..లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ రానుంది. దీంతో జగన్ కోరిక, కల నెరవేరే ఛాన్స్ ఇప్పటిలో లేదు అనే చెప్పొచ్చు. వైజాగ్ విషయంలో జగన్ చెప్పిన పని ఏదీ చేయలేక పోయారు. మూడు రాజధానుల నినాదం అందుకున్న జగన్ ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత కీలకమైన నగరం వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. విశాఖపట్నం మాత్రమే ఇందుకు అనువైన నగరం అంటూ అయన వాదించారు. పలు మార్లు ఈ విషయాన్ని పలు సమావేశాల్లో చెప్పారు కూడా. కానీ జగన్ పదవి కాలం పూర్తికావస్తున్నా అయన ప్రకటించిన పరిపాలన రాజధాని గా వైజాగ్ ను చేయటంలో విఫలం అయ్యారు. దీంతో అటు రాజధాని గా అమరావతి కాకుండా...ఇటు ఏ రాజధాని ఏంటో అన్న గందరగోళం మాత్రం జగన్ క్రియేట్ చేశారు. వైజాగ్ విషయంలో తాను చేప్పిన మాట అమలు చేయలేక పోవటంతో రాజకీయంగా ఈ విషయంలో నష్టం జరగకుండా చూసుకునేందుకు జగన్ ఫ్యామిలీ తో సహా వైజాగ్ కు షిఫ్ట్ అవ్వాలని ప్లాన్ వేసుకున్నారు.

సీఎం ఎక్కడ నుంచి అయినా పరిపాలించే వెసులుబాటు ఉండటంతో ఈ మార్గం ఎంచుకున్నారు. సీఎం ఒక్కరు షిఫ్ట్ అయితే ఎలాంటి సమస్య ఉండేది కాదు..కానీ సీఎం తో పాటు అయన కార్యాలయాలు...కొన్ని శాఖలు కూడా వైజాగ్ కు షిఫ్ట్ చేయాలనే ప్రతిపాదనతో ఏర్పాట్లు చేయటం...దీనికి భవనాలు ఎంపిక చేయటంతో వ్యవహారం మళ్ళీ కోర్టు కి వెళ్ళింది. మొత్తం ఎక్కడికి అక్కడే ఆగిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అంశం ఎన్నికల ఎజెండా లో ఒక ప్రధాన ఇష్యూగా ఉండబోతుంది. వైసీపీ అండ్ జగన్ మూడు రాజధానులు తమ విధానం అని చెపుతుంటే ..ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగు దేశం తో పాటు జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లు కూడా అమరావతి ఒక్కటే రాజధాని అనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అని స్పష్టంగా చెప్పొచ్చు. ప్రజలు అమరావతి వైపు మొగ్గు చూపుతారా ..లేక జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల వైపా అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it