వైసీపీ కి లెక్క కుదరటం లేదు!
వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాను ఏకంగా 30 సంవత్సరాలు అధికారంలో ఉండాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇదే విషయాన్నీ ఆయన బహిరంగంగానే చెప్పారు. అయితే ఇప్పుడు సీన్ చూస్తుంటే ఐదేళ్లకే సీఎం సీటు నుంచి జగన్ పక్కకు తప్పుకోక తప్పదు అనే సంకేతాలే కనిపిస్తున్నాయి. శనివారం సాయంత్రం వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువ ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే అని స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఎగ్జిట్ పోల్స్ విషయంలో అత్యధిక శాతం పక్కా ఫలితాలను వెల్లడిస్తున్న సంస్థ ఇండియా టుడే -యాక్సిస్ మై మాత్రమే. ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే 21 నుంచి 23 లోక్ సభ సీట్లను కూటమికి ఇచ్చింది. ఇందులో కనీసం ఇరవై లోక్ సభ సీట్లు నిజం అనుకున్న 140 అసెంబ్లీ సీట్లు లెక్క వేయవచ్చు. అయితే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండే ఏడుకు ఏడు సీట్లు ఒకే పార్టీ గెలుచుకోవటం కూడా సాధ్యం అయ్యే ఛాన్స్ ఉండదు అనే చెప్పొచ్చు. అందుకే ఈ 140 అసెంబ్లీ సీట్లలో మరో 15 సీట్లు తీసేసినా కూడా కూటమికి పక్కాగా 125 సీట్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది అని లెక్కలు కడుతున్నారు. ఎక్కడ వరకో ఎందుకు ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో ఇండియా టుడే -యాక్సిస్ మై ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎంత పక్కాగా నిజం అయ్యాయో అందరూ చూశారు.
అందుకే శనివారం నాడు చాలా మంది ఇండియా టుడే-యాక్సిస్ మై ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఒక్క ఇండియా-యాక్సిస్ మై మాత్రమే కాకుండా పేరున్న పలు జాతీయ ఛానెల్స్ కూడా టీడీపీ, జన సేన, బీజేపీ కూటమికే అత్యధిక లోక్ సభ సీట్లు ఇచ్చాయి. అయితే ఆరా మస్తాన్ తో పాటు టైమ్స్ నౌ లు మాత్రం అధికార వైసీపీ కి మొగ్గు ఇచ్చాయి. అయితే పాపులర్ ప్రజాభిప్రాయం తో పాటు తాజాగా వెల్లడి అయిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే కూటమి అధికారంలోకి రావటానికి ఛాన్స్ లు ఎక్కువ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత అధికార వైసీపీ కి చెందిన కీలక నేతలు, కొంత మంది మంత్రులు చేసిన ప్రకటనలు చూస్తే ఎక్కడో తేడా కొడుతోంది అనే అనుమానాలు చాలా మంది లో వ్యక్తం అయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ వెల్లడి అయిన తర్వాత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా పలు అనుమానాలు రేకెత్తించేదిలా ఉంది అనే చెప్పాలి. ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు స్పష్టత ఇచ్చాయని చెప్పాలి. అయితే మంగళవారం నాడు అంటే జూన్ నాలుగున జరిగే కౌంటింగ్ తో ఈ సస్పెన్స్ కు తెరపడనుంది. అప్పటివరకు ఎవరికి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు చూసుకుని సంతృప్తిపడటమే.