Telugu Gateway
Andhra Pradesh

ప్రశాంత్ కిషోర్ పై అప్పుడలా..ఇప్పుడు ఇలా !

ప్రశాంత్ కిషోర్ పై అప్పుడలా..ఇప్పుడు ఇలా !
X

ఆటలో అయినా...ఎన్నికల్లో అయినా ఒకసారి ఒకరే గెలుస్తారు. ఆటలో అయితే ఫలితం అప్పటికప్పుడు వస్తుంది. ఎన్నికల్లో అయితే కౌంటింగ్ వరకు ఫలితం కోసం ఆగాల్సిందే. హోరాహోరీగా సాగిన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల ఫలితాల వెల్లడికి గ్యాప్ ఎక్కువ ఉండటంతో పోటీలో నిలిచిన ఇద్దరూ ఎవరి లెక్కలు వాళ్ళు చెపుతున్నారు. ఈ ఎన్నికల్లో ఫలితం టీడీపీ, జన సేన, బీజేపీ కూటమికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అని ఎక్కువ మంది చెపుతున్న మాట. ఆ పార్టీ లు కూడా అధికారికంగా తాము దగ్గర దగ్గర 130 సీట్లకు తగ్గకుండా సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెపుతున్నాయి. అధికార వైసీపీ కూడా తమ ప్రభుత్వ పనితీరుకు ప్రజలు సానుకూలంగా స్పందించి తీర్పు ఇచ్చారని ఇంతవరకు ఆ పార్టీ నేతలు చెపుతూ వచ్చారు. గురువారం నాడు వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు.

ఆయన విజయవాడ లో వైసీపీ కోసం పనిచేసే రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐ ప్యాక్ కార్యాలయాన్ని సందర్శించారు. ఐ ప్యాక్ గత కొన్ని సంవస్త్రరాలుగా వైసీపీ కి సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అక్కడే జగన్ మాట్లాడుతూ గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించబోతున్నట్లు ప్రకటించారు. 175 లో 151 సీట్లు చాలా మంచి నంబర్ ...25 ఎంపీ సీట్లలో 22 సీట్లు కూడా పెద్ద నంబర్. ఈ సారి కూడా గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తాం. జూన్ 4 న వచ్చే ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుంది అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేని అన్ని సీట్లు వస్తాయి. ప్రశాంత్ కిషోర్ చేసేది ఏమి లేదు..అంతా టీమే చేస్తుంది అంటూ జగన్ వ్యాఖ్యానించటం విశేషం.

దీనికి కారణం ఉంది. గత కొన్ని రోజులుగా ప్రశాంత్ కిషోర్ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో జగన్ దారుణంగా దెబ్బతినబోతున్నారు అని చెపుతూ వస్తున్నారు. జగన్ ఓటమి చాలా తీవ్రంగా ఉంటుంది అని కూడా అయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇదే జగన్ 2017 ప్లీనరీ లో మాట్లాడుతూ మోడీ ని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టడానికి క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ . నితీష్ కుమార్ ను బీహార్ పీఠం పై కూర్చోబెట్టడానికి క్రియాశీలక ఫాత్ర పోషించిన వ్యక్తి , ప్రశాంత్ కిషోర్ తన పూర్తి నైపుణ్యం..తన సహాయ సహకారాలు మనకు..మన శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారు అంటూ బహిరంగ సభలో ప్రకటించారు. ఇప్పుడు ఆయన వైసీపీ కి వ్యతిరేకంగా మాట్లాడుతుండటంతో జగన్ అయనపై ఐ ప్యాక్ ఆఫీస్ లో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశగా మారాయి. గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు వస్తాయని జగన్ చెపితే..మంత్రి బొత్స సత్యనారాయణ ఒక అడుగు ముందుకు వేసి జూన్ 9 న విశాఖపట్నం లో జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు అని సంచలన ప్రకటన చేశారు.

Next Story
Share it