జగన్ ప్రయోగం ఫలితానిస్తుందా?!
ఈ లెక్కన చూస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తే టికెట్ నిరాకరిస్తారు తప్ప...ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పే ప్రయత్నం చేయలేదు అని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే ఇప్పుడు పార్టీ కి పెద్ద మైనస్ గా మారే అవకాశం ఉంది అని చెపుతున్నారు. ఇది ఒకటి అయితే ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన చోటును వదిలిపెట్టి వేరే నియోజకవర్గాలకు వెళ్లే నేతలు ఇప్పటికిప్పుడు అక్కడ పట్టు సాధించి విజయం సాధించటం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఇప్పటివరకు అక్కడ ఉన్న నేతలు సహకరించటం కూడా అనుమానమే. ఎన్నో సవాళ్లు కొత్తగా నియోజకవర్గం మారే వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవేమి కాదు...కేవలం జగన్ ను చూసి ఓట్లు వేసి గెలిపిస్తారు అనుకుంటే...ఆ పని మరి పాత నియోజకవర్గంలో కూడా చేయాలి కదా?. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మార్పులు భారీగా ఉంటే..తమకు టికెట్ ఇవ్వకపోయినా సరే పార్టీ చెప్పిన వారిని గెలిపిద్దాం అనేంత ఉదార హృదయం కలిగినవారు రాజకీయాల్లో అతి తక్కువగా ఉంటారు అనే చెప్పాలి. అయినా వ్యతిరేకత ఒక్క ఎమ్మెల్యేల విషయంలోనే ఉంటదా...మొత్తం ప్రభుత్వ పనితీరుపై ఉండదా అని కొంతమంది నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కారు పలు విషయాల్లో ప్రజల వ్యతిరేకత ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అటు కేంద్రంతో ...ఇటు నిన్న మొన్నటి వరకు తెలంగాణాలో ఉన్న కెసిఆర్ సర్కారుతో ఎంతో సఖ్యతతో ఉండి కూడా విభజన సమస్యల పరిష్కారం, హామీల సాధనలో జగన్ సర్కారు విఫలం అయిన విషయం తెలిసిందే. ఇవన్నీ వదిలేసి ప్రజలు జగన్ చేసే మార్పులకు మార్కులు వేసి గెలిపిస్తారు లేదా అన్నది తేలాలంటే వేచిచూడాల్సిందే.