కూటమి సర్కారు కాస్తా జాయింట్ వెంచర్ సర్కార్ గా మారిందా?!

ప్రతిపక్షం అంటే ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి. ఒక వైపు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ప్రభుత్వ ఖజానాకు అధికారంలో ఉన్న వాళ్ళు గండి కొడుతుంటే దాన్ని గట్టిగా ప్రశ్నించాలి. కానీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అనకాపల్లి జిల్లా పంచదార్ల కొండ దగ్గర జరిగిన అక్రమ మైనింగ్ విషయంలో వైసీపీ గట్టిగా పోరాటం చేసింది. అక్రమ మైనింగ్ విషయాన్ని ఆధారాలతో సహా బహిర్గతం చేయటంతో అక్కడ మైనింగ్ ను నిలిపివేసేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. అయితే ప్రజలు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యల విషయంలో కూడా వైసీపీ కూడా ప్రజల పక్షం వైపు కాకుండా కొన్ని సంస్థల ప్రయోజనాల కాపాడే ప్రయత్నం చేస్తోంది అనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొంత మంది పారిశ్రామిక వేత్తల విషయంలో...కొన్ని కంపెనీల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒక అవగాహనతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లో సీనరేజ్ వసూలు కాంట్రాక్టు దక్కించుకున్న ఏఎంఆర్ ఇండియా చివరకు రైతులు తమ సొంత అవసరాల కోసం ఎక్కడ మట్టి తవ్వుకున్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి సీనరేజ్ ఫీజు వసూలు చేస్తూ వేధిస్తోంది అనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ప్రైవేట్ సైన్యం పెట్టుకుని మరీ ఈ దందా నడిపిస్తున్నారు అని టీడీపీ వర్గాలు కూడా చెపుతున్నాయి. పలు జిల్లాల్లో రైతుల తో పాటు సామాన్య ప్రజలు కూడా ఈ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వైపు వసూలు చేసే ఈ సీనరేజ్ కూడా ఎప్పుడో తాపీగా చెల్లిస్తోంది ఈ సంస్థ. అంతే కాదు ప్రభుత్వానికి చట్టబద్ధంగా కట్టాల్సిన స్టాంప్ డ్యూటీ కూడా కట్టకుండా ఎగవేసింది. అయినా కూడా వైసీపీ నేతలు ఈ విషయంలో అసలు నోరు తెరిచి మాట్లాడటం లేదు. దీని వెనక ప్రధాన కారణం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి..ఏఎంఆర్ అధినేత మహేష్ రెడ్డి కి ఉన్న సన్నహిత సంబంధాలే అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే కూటమి ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లు కూడా భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అనే వ్యూహంతోనే జగన్ కు సన్నిహితుడు అని ప్రచారం ఉన్న విశ్వేశ్వర్ రెడ్డి తో పాటు మరి కొంత మందికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనే చర్చ టీడీపీ నాయకుల్లో కూడా ఉంది.
ప్రతిపక్షంలో ఉండగా ఇండోసోల్ సోలార్ ప్రాజెక్ట్ పై ఎన్నో విమర్శలు చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ కార్పెట్ వేసి మరీ సహకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడు అనే పేరుంది. వైజాగ్ లో వందల కోట్ల రూపాయల విలువ చేసే దసపల్లా భూముల విషయంలోనూ ఇదే తీరు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ఈ భూములను కొట్టేయాలని టీడీపీ ప్లాన్ వేసింది అంటూ తీవ్ర ఆరోపణలు ఆరోపణలు చేసిన వైసీపీ ...అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూములకు లైన్ క్లియర్ చేసింది. ఇవి ఇప్పుడు ఎక్కువగా వైసీపీ కి అత్యంత సన్నిహితుల చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు దసపల్లా భూముల విషయంలో రెండు పార్టీలు అంటే అధికార పార్టీ..ప్రతిపక్షం సహకరించుకుంటూ ముందుకు సాగుతున్నాయి అని..దీని ప్రధాన కారణం ఎవరికి వెళ్లాల్సిన వాటాలు వాళ్లకు వెళ్ళటమే అన్నది కొంత మంది మంత్రులు చెపుతున్న మాట. ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం కాస్తా ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల జాయింట్ వెంచర్ ప్రభుత్వంగా మారిపోయింది అనే వ్యాఖ్యలు అధికార వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.



