నియంత్రిత పాలన...నియంత్రిత ఫీడ్ !
ఎన్నికలప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా తమ పార్టీ కి పెద్ద ఎత్తున మీడియా లో ప్రచారం రావాలని కోరుకుంటుంది. అందుకే చాలా సందర్భాల్లో కీలక నేతలు, ముఖ్యంగా పార్టీ అధ్యక్షుల సభలకు వాళ్లే మీడియా ను వాహనాలు ఏర్పాటు చేసి మరీ వెంట తీసుకెళతారు. ఇది గత కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న విషయం. ఎన్నికల సమయంలో ఇది కాస్త మరింత పెరుగుతుంది. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఎంతో మంచి చేసిన తాను కాక ఇంకెవరు గెలుస్తారు అనే ధీమా చూపిస్తున్న వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ తన బస్ యాత్ర సందర్భంగా మీడియా ను ఏ మాత్రం దగ్గరకు రానివ్వటం లేదు. జగన్ నిత్యం చెప్పే ఆయన వ్యతిరేక మీడియా విషయంలోనే ఇలా చేస్తున్నారు అనుకుంటే పొరబడినట్లే. అసలు జగన్ సభలు తప్ప ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ అనే పార్టీ ఒకటి ఉంది అని గుర్తించకుండా వ్యవహరిస్తున్న ఛానళ్ల పరిస్థితి కూడా అదే. ఇదే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మీడియా, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జగన్ బస్ యాత్ర లో కీలక ఘట్టాలతో పాటు ప్రతి రోజు సాయంత్రం జరిగే బహిరంగ సభల కంటెంట్ ను కూడా ఐ ప్యాక్ ఏర్పాటు చేసిన టీం లు తీసి ఇస్తే వాటిని వేసుకోవాల్సిందే. జగన్ సభ లైవ్ చూస్తే అది ప్రసారం చేసే ఏ టీవీ లో అయినా సరే ఒకే విజువల్స్ కనిపిస్తాయి తప్ప మార్పు ఉండదు. ఎందుకంటే లైవ్ ను కూడా కంట్రోల్ చేసి ఇచ్చిన ఫీడ్ మాత్రమే ప్రసారం చేయాల్సి ఉంటుంది అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అస్మదీయ చానెల్స్ గా ప్రచారం లో ఉన్న వాళ్ళ సిబ్బంది అయినా సరే సొంతంగా కెమెరాలు పెట్టి వీడియో లు తీయటానికి లేదు అని తేల్చేశారు. అదే సమయంలో ఐ ప్యాక్ టీం ప్రతి సమావేశానికి రెండు రోజుల ముందు ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్లాన్ అంతా సిద్ధం చేస్తుంది అని..సీఎం జగన్ కొంత మందితో నిర్వహించే సమావేశాలు అన్ని కూడా స్క్రిప్ట్ ప్రకారమే సాగుతున్నాయని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.