మళ్ళీ గెలిస్తే ఆయనే టీటీడీ చైర్మన్!
వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి టీటీడీ ఈవో ధర్మా రెడ్డి పై ఉన్న ప్రత్యేక ప్రేమ అందరికి తెలిసిందే. సీనియర్ ఐఏఎస్ లకు మాత్రమే ఇవ్వాల్సిన ఈవో పోస్ట్ ను రక్షణ శాఖ అధికారిగా ఉన్న ధర్మా రెడ్డి కి ఇవ్వటంలో తెరవెనక కారణాలు చాలా ఉన్నాయనే చర్చ అధికార వర్గాల్లో ఉంది. వై వి సుబ్బా రెడ్డి చైర్మన్ గా... ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఈవో గా ఉన్న సమయంలో కూడా ధర్మారెడ్డి కే సీఎం జగన్ ఎక్కడలేని ప్రాధాన్యత ఇచ్చేవారు అని టీటీడీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. తొలుత జేఈవో గా వచ్చిన ధర్మా రెడ్డి క్రమక్రమంగా పూర్తి స్థాయి ఈవో గా నియమితులు అయ్యారు. డెప్యూటేషన్ పై ఉన్న ధర్మారెడ్డి పదవి కాలం ఈ మే 14 తో ముగియనుంది. అంటే సరిగ్గా ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన మరుసటి రోజుతో అన్న మాట. జూన్ ఆరు వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉండనుంది. అత్యంత కీలకమైన వేసవి సమయంలో తిరుమలలో రద్దీ చాలా ఎక్కువ ఉంటుంది అని...ధర్మా రెడ్డి వంటి ఈవో లేకపోతే ఇబ్బందులు వస్తాయని అంటూ అయన డెప్యూటేషన్ ను ధర్మా రెడ్డి పదవీకాలం ముగిసే జూన్ 30 వరకు పొడిగించాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నందున కేంద్రంలో కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉంది. మరి ఈ సమయంలో మోడీ సర్కారు జగన్ కోరినట్లు ధర్మా రెడ్డి డెప్యూటేషన్ మరో సారి పొడిగించి తన ఉదారత చాటుకుంటుందా లేదా అన్నది తేలాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. అయితే సీఎం జగన్ ఎందుకు ధర్మా రెడ్డి పై ఇంత ప్రత్యేక ప్రేమ చూపిస్తున్నారు అంటే అధికార వర్గాల్లో రకరకాల చర్చలు ఉన్నాయి.
ధర్మా రెడ్డి టీటీడీలో భక్తుల సౌకర్యాలు మెరుగుపర్చడం కంటే ప్రభుత్వ పెద్దల రకరకాల అవసరాలు తీర్చటం..లాబీయింగ్ చేయటం తోనే అంత ప్రాధాన్యత దక్కుతుంది అని ఒక ఐఏఎస్ అధికారి వెల్లడించారు. జగన్ కోరుకున్నట్లు డెప్యూటేషన్ కు అనుమతి వస్తే ...రెండవ సారి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ విజయం సాధిస్తే ధర్మా రెడ్డి ని ఏకంగా ఈ సారి టీటీడీ చైర్మన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. ఇదే విషయాన్ని ధర్మారెడ్డి కూడా పలువురి వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. గతం ఎన్నడూలేని రీతిలో ధర్మా రెడ్డి జేఈవోగా , ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భక్తులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్లు విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. రద్దీ సమయంలో దర్శనం కోసం వేచిచూసే సమయం ఎక్కువ ఉన్నా కూడా కంపార్ట్మెంట్స్ లో ఉండే భక్తులకు గతంలో సమయానికి అనుగుణంగా ఫలహారం తో పాటు పాలు, టీ వంటి అందించేవారు అని... ధర్మా రెడ్డి హయాంలో ఈ సేవల విషయంలో భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో టీటీడీ నిధులను కూడా భక్తుల విస్తృత ప్రయోజనాల కోసం కాకుండా సొంత అవసరాల కోణంలో ఉపయోగించినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. టీటీడీ ఖర్చుతో వేసిన రోడ్ల విషయంలో ఇలాంటి విమర్శలు ఉన్నట్లు చెపుతున్నారు. అంతే కాదు ధర్మా రెడ్డి ని ఈవో గా నియమించిన సమయంలో తెలుగు దేశం నేతలు విమర్శలు చేస్తే...ధర్మా రెడ్డి ఒక రాజకీయ నాయకుడి తరహాలో సవాళ్లు చేశారు అని..ఇలాంటి పద్ధతి గతంలో ఎప్పుడు లేదు అని ఒక అధికారి తెలిపారు. అర్హతల విషయంలో ప్రతిపక్షాలు మాట్లాడితే ఏదైనా ఉంటే ప్రభుత్వం సమాధానం చెప్పటం...లేదా వివరణ ఇవ్వటం పద్ధతి. అలా కాకుండా ఆరోపణలు ఎదుర్కొన్న ధర్మా రెడ్డి తనకు తానే స్వయంగా సమాధానం ఇవ్వటంతో పాటు రాజకీయ నేత తరహాలో మీడియా సాక్షిగా సవాళ్లు కూడా విసిరారు. ఇలాంటి అధికారిపై సీఎం జగన్ ప్రత్యేక ప్రేమ చూపించటం వైసీపీ లో కూడా చర్చనీయాంశంగా మారింది.