Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు కు 118 కోట్ల ముడుపులు!

చంద్రబాబు కు 118 కోట్ల ముడుపులు!
X

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి దగ్గరైతే చాలు ఐటి, ఈడీలు అలాంటి వాళ్ళ వైపు కన్నెత్తి చూడవని రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. అలాంటిది తెలుగు దేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఐటి శాఖ తాజాగా నోటీసు లు ఇవ్వటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణం అయింది అనే చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చంద్రబాబు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కు దగ్గరవుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం అయ్యారు. తాజాగా ఎన్టీఆర్ వంద రూపాయల స్మారక నాణెం విడుదల సందర్భంగా కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఢిల్లీ లో మీడియా తో చిట్ చాట్ చేసిన చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ పై ప్రశంసల వర్షం కురిపించారు. దీనిపై ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఐటి శాఖ చంద్రబాబు కు నోటీసు ఇవ్వటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ నోటీసు లు ఆగస్టు 4 న ఇచ్చినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక హిందుస్థాన్ టైమ్స్ వెల్లడించింది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ఆంధ్ర ప్రదేశ్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు లను ఎల్ అండ్ టి తో పాటు షాపూర్జీ అండ్ పల్లోంజీ సంస్థలకు కేటాయించారు. ఈ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థల నుంచి ముడుపుల రూపంలో తీసుకున్న 118 కోట్ల రూపాయలను ఎందుకు బహిర్గతం చేయని ఆదాయంగా చూడకూడదు అంటూ ఐటి శాఖ తన నోటీసు లో పేర్కొంది. హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ ఈ నోటీసు లు జారీ చేసింది. అంతకు ముందు చంద్రబాబు లేవ నెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చి ఐటి శాఖ తాజాగా నోటీసు లు జారీ చేసింది. బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా లెక్కల్లో చూపని ఆదాయాన్ని మాజీ సీఎం కు అందచేసినట్లు ఐటి శాఖ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి తాము కొన్ని రికార్డు లను స్వాధీనం చేసుకోవటం తో పాటు కొంత మంది స్టేట్ మెంట్స్ కూడా రికార్డు చేసినట్లు ఐటి శాఖ వెల్లడించింది. ఈ వ్యవహారం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో మరింత కాకరేపటం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story
Share it