Telugu Gateway
Andhra Pradesh

ఇవి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ పెంచుతాయా?

ఇవి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ పెంచుతాయా?
X

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీకి చెందిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలను ఎవరూ సమర్ధించరు. అడ్డగోలుగా మాట్లాడిన వాళ్లకు ఎవరికైనా చట్టం ద్వారానే సమాధానం చెప్పాలి. కానీ గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం అధికార టీడీపీ కూడా వైసీపీ లాగానే మారుతున్నట్లు ఉంది అనే ఫీలింగ్ ఎక్కువ మందిలో కలిగిస్తోంది. ఏ పార్టీ కానీ వాళ్ళు కూడా వైసీపీ తో పోలిస్తే చాలా విషయాల్లో తెలుగు దేశం పార్టీ బెటర్ అనే భావనలో ఉంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారే వాతావరణం స్వయంగా తెలుగు దేశం నాయకత్వమే కల్పిస్తోంది అనే చర్చ కొంత మంది పార్టీ నాయకుల్లో కూడా ఉంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ సారథ్యంలోని కూటమికి ప్రజలు ఓట్లు వేసింది చంద్రబాబు నాయుడు ఏదో అద్భుతమైన పాలన అందిస్తారు అని కాకుండా....గత ప్రభుత్వంలో సాగిన పలు అరాచకాలకు అడ్డుకట్టపడుతుంది అనే.

జగన్ మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో వివిధ బటన్ నొక్కుడు పధకాల ద్వారా ప్రజలకు లక్షల కోట్ల రూపాయలు పంచినా కూడా పదకొండు సీట్లకు పరిమితం చేశారు అంటే ప్రజల్లో వైసీపీ పాలనపై ఎంత వ్యతిరేకత వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ఐఏఎస్ లు..వైసీపీ అధికారులు అని ప్రచారం చేసిన వాళ్ళతోనే ఇప్పుడు టీడీపీ కలిసి అన్నీ చేస్తుండంతో ప్రజల సంగతి ఏమో కానీ కొంత మంది టీడీపీ నాయకులతో పాటు క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి ఉంది. వైసీపీ అనుకూలురుగా ముద్రపడిన పారిశ్రామికవేత్తలకు కూడా చంద్రబాబు నాయుడు పెద్ద పీట వేయటమే కాకుండా...అడ్డగోలుగా వాళ్లకు మేలు చేసి పెడుతున్నారు అనే ఆరోపణలు సొంత పార్టీ నాయకులే చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ హయాంతో పోలిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అవినీతి ఏ మాత్రం తగ్గగపోగా ...మరింత దారుణంగా మారిపోయింది అనే విమర్శలు సొంత పార్టీ నాయకుల నుంచే వినిపిస్తున్నాయి. కొంత మంది ఎమ్మెల్యేలు అయితే వైసీపీ మోడల్ ను పక్కాగా ఫాలో అవుతున్నారు అనే చర్చ ఉంది. ఇదే విషయంపై మీడియాలో పలు వార్తలు కూడా వచ్చాయి. మొన్నటి ఎన్నికల్లో కూటమికి ఎవరూ ఊహించని మెజారిటీని ప్రజలు కట్టబెట్టారు. కానీ ఏడాదిన్నర కాలంలోనే కూటమి ప్రభుత్వ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది.

ఒక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోకి పెట్టుబడులు రావాలంటే లా అండ్ ఆర్డర్ పక్కాగా ఉండాలి అని చెపుతారు. కానీ ఇప్పుడు టీడీపీ కి చెందిన క్యాడరే కారణాలు ఏమైనా కానీ ఏకంగా ప్రతిపక్ష నాయకుల ఇళ్లపైకి ఏకంగా పెట్రోల్ నింపిన బాటిల్స్ విసిరేశారు. నిప్పు పెట్టారు. కృష్ణా జిల్లాలో ఈ ట్రెండ్ ఇప్పుడు కొత్తగా మొదలైంది అనే చర్చ కూడా సాగుతోంది. పదే పదే బ్రాండ్ గురించి మాట్లాడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి చర్యల ద్వారా తన బ్రాండ్ మరింత పెరిగింది అని చెప్పుకుంటారా?. తప్పు చేసిన వాళ్ళను వదిలేయమని ఎవరూ చెప్పరు. కానీ దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. తాజా టీడీపీ మోడల్ చూసిన వాళ్ళు ఎక్కువ మంది చాలా విషయాల్లో టీడీపీ కూడా వైసీపీ నే ఫాలో అవుతుంది అనే వ్యాఖ్యలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.

Next Story
Share it