Telugu Gateway
Andhra Pradesh

అన్ని శాఖలు ఆయనవేనా?!

అన్ని శాఖలు ఆయనవేనా?!
X

ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హవా అంతా నారా లోకేష్ దే అనే ప్రచారం కూటమి నేతల్లో ఎప్పటి నుంచో ఉంది. అధికారుల పోస్టింగ్ ల దగ్గర నుంచి క్యాబినెట్ కూర్పులోనూ నారా లోకేష్ భవిష్యత్ కోణంలోనే టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు అనే చర్చ ఉన్న సంగతి తెలిసిందే. ఇవి అన్ని అనధికారిక చర్చలు. సోమవారం నాడు ఏపీ ఐటి, మానవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన చూసిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో నారా లోకేష్ సూపర్ సీఎం గా వ్యవహరిస్తున్నారు అనే చర్చ నిజం అని చూపించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది అనే అభిప్రాయం టీడీపీ నేతలే వ్యక్తం చేస్తున్నారు.

నారా లోకేష్ ఢిల్లీ లో కేంద్ర మంత్రి జీ పీ నడ్డాను కలిసి రాష్ట్రంలో యూరియా కొరత ఉంది అని..వెంటనే కేటాయించాల్సిందిగా కోరినట్లు తన పేస్ బుక్ పేజీ లో అధికారికంగా రాసుకున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడుతో సంబంధం లేకుండా ఆయనే ఈ పని చేశారు. మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అయి విజయవాడ బెంజి సర్కిల్ దగ్గర ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు – మచిలీపట్నం మధ్య 6లైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని కోరటం తో పాటు ఇతర వినతులు కూడా చేశారు. కానీ పక్కన ఆంధ్ర ప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీ సి జనార్దన్ రెడ్డి లేరు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తో కూడా మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. బీపీసీఎల్ సంస్థ నిర్మించే రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ త్వరితగతిన కార్యకలాపాలను ప్రారంభించేందుకు సహకారం అందించాల్సిందిగా కోరటంతో పాటు రామాయపట్నం పోర్టు సమీపాన బీపీసీఎల్ సంస్థ 6వేల ఎకరాల్లో రూ.95వేల కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన రిఫైనరీ – కమ్ – పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కు సంబంధించి పనుల పురోగతిపై చర్చించినట్లు నారా లోకేష్ తెలిపారు.

రాష్ట్రంలో ఇవి పరిశ్రమల శాఖ పరిధిలోకి వస్తాయి. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టి జీ భరత్ తో సంబంధం లేకుండానే నారా లోకేష్ ఈ పని చేశారు. కేంద్ర ఐటి , రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయి అడ్వాన్స్ డ్ టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, క్వాంటమ్ ఆవిష్కరణలు, విధానపరమైన సంస్కరణల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్ కు సహకారం అందించాలని విజ్జప్తి చేసినట్లు తెలిపారు. ఇది నారా లోకేష్ శాఖ పరిధిలోని అంశమే కాబట్టి ఇందులో తప్పుపట్టాల్సింది ఏమి లేదు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ తో కూడా నారా లోకేష్ సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో జీడి, మిర్చి, మామిడి బోర్డులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళంలో జీడి బోర్డు, మిర్చి రైతుల ఆదాయాన్ని స్థిరీకరించి, ప్రపంచవ్యాప్తంగా మిర్చి ఎగుమతులను పెంచడానికి గుంటూరులో మిర్చి బోర్డు.. సప్లయ్ చైన్, ప్రపంచ పోటీతత్వాన్ని బలోపతం చేసేందుకు చిత్తూరులో మామిడి బోర్డును ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు.

మరో వైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో భేటీ అయి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉదారంగా ఆర్థిక సాయం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న ప్రాజెక్ట్ లకు కూడా ఆర్థిక సాయం అందించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. నారా లోకేష్ మొత్తం ఎనిమిది మంది కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. ఏపీలో మరో మంత్రికి ఇలా తన శాఖకు సంబంధము లేకుండా ఇతర కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే ఛాన్స్ వస్తుందా అంటే ఖచ్ఛితంగా నో అనే చెప్పొచ్చు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ నారా లోకేష్ ఇది అంతా ఒక ప్లాన్ ప్రకారమే చేసినట్లు ఉంది అనే చర్చ కూడా సాగుతోంది. ఇలా అన్ని శాఖల్లో జోక్యం చేసుకునే అధికారం ఒక్క ముఖ్యమంత్రికి తప్ప మరొకరికి ఉండదు. మరి నారా లోకేష్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ క్యాబినెట్ లోని ఇతర మంత్రుల శాఖల అధికారాలు కూడా అప్పగించారా?. లేక ఆయన్ను అధికారికంగానే సూపర్ సీఎం ను చేశారా అని ఒక మంత్రి విస్మయం వ్యక్తం చేశారు.

Next Story
Share it