Telugu Gateway
Andhra Pradesh

అన్ని నేనే అంటారా !

అన్ని నేనే అంటారా !
X

గత ఐదేళ్ల కాలంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మంత్రులను పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలను అయితే ఏ మాత్రం కేర్ చేయలేదు. అంతా తానే అన్నట్లు నడిపించారు. ఎన్నికల ముందు కూడా తన పాలన చూసే ప్రజలు ఓట్లు వేస్తారు అని చెప్పుకున్నారు. అసలు మంత్రులు...ఎమ్మెల్యేల పాత్ర ఏమి ఉంటది అన్నట్లు వ్యవహరించారు. కానీ ఫలితం ఏమైందో అందరూ చూశారు. జగన్ ఒక ప్లాన్ ప్రకారం తన ఐదేళ్ల పాలనాకాలంలో సొంత పత్రికకు మేలు చేకూర్చేలా నవరత్నాల పథకాల అమలు డిజైన్ చేసినట్లు ఉన్నారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ప్రతి విడత పథకం అమలు సమయంలో సొంత పత్రికకు జాకెట్ యాడ్స్...ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చుకుంటూ ముందుకు సాగారు. అయితే ఈ యాడ్స్ సమయంలోనూ జగన్ కేవలం తన ఫోటో తప్ప..సంబంధింత శాఖల మంత్రుల ఫోటో లు కూడా వేయలేదు. అది జాకెట్ యాడ్ అయినా..ఫుల్ పేజీ యాడ్ అయినా శాఖ మంత్రి పేరు మాత్రం కింద రాసే వాళ్ళు. ప్రభుత్వం అంటే తాను ఒక్కరే అన్నట్లు జగన్ ఐదేళ్లపాటు వ్యవహరించారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం మారింది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు కూడా జగన్ బాటలోనే పయనిస్తున్నట్లు ఉంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనికి ప్రధాన కారణం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సోమవారం పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో కూడా ఒక్క చంద్రబాబు ఫోటో తప్ప..సంబంధింత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఫోటో మచ్చుకు అయినా లేదు.

ఫోటో లేకపోవటమే కాదు...కనీసం జగన్ లాగా...మంత్రి పేరు కూడా ప్రకటనలో కనిపించకపోవడం అధికార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు స్వయంగా సోమవారం నాడు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించి పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ తో పాటు సంబంధింత శాఖ మంత్రి కూడా కొండపల్లి శ్రీనివాస్ ను కూడా చంద్రబాబు తనతో కూర్చోపెట్టుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. అది ప్రకటనల విషయంలో అయినా..మరో విషయంలో అయినా ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి ఒక్కరే అన్న చందంగా వ్యవరిస్తే ఎలా ఉంటుందో కళ్ళ ముందు జగన్ ఉదాహరణ ఉన్నా కూడా చంద్రబాబు ఇలా వ్యవహరించటం సరికాదు అనే చర్చ సాగుతోంది. చెప్పిన విధంగా ఒకే సారి ఏడు వేల రూపాయల పెన్షన్లు ఇవ్వటం అన్నది సానుకూల సంకేతం పంపింది. ఇలాంటి తరుణంలో అవసరం లేని తప్పులు చేసి చిక్కులు తెచ్చుకుంటే చేసిన మంచిపనుల కంటే ఇతర అంశాలు కీలకం అవుతాయి. సీఎంగా ఉన్న వ్యక్తి వ్యవహరిస్తున్న తీరు కూడా ఇందులో అత్యంత ప్రధానమైనది. అంతా తామే అన్నట్లు వ్యవహరించిన కెసిఆర్, జగన్ లకు ఏమి జరిగిందో చంద్రబాబు కళ్ళ ముందే ఉంది.

Next Story
Share it