Telugu Gateway
Andhra Pradesh

అనుమతి ఇచ్చింది 4 . 5 కోట్లకు ..కానీ 13 .5 కోట్ల చెల్లింపులకు క్యాబినెట్ ఓకే

అనుమతి ఇచ్చింది 4 . 5 కోట్లకు ..కానీ 13 .5 కోట్ల చెల్లింపులకు క్యాబినెట్ ఓకే
X

తప్పు చేసినట్లు దొరికితే ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఇదే నిత్యం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు చెప్పేమాటలు. కానీ మాటలు ఒకటి..చేతలు మరొకటి అన్న విషయం ఇప్పటికే ఎన్నో సార్లు రుజువు అయింది. ఇప్పుడు మరో సారి అది క్యాబినెట్ సాక్షిగా ప్రూవ్ అయింది. అడ్డగోలుగా దొరికినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏకంగా క్యాబినెట్ లో పెట్టి మరీ జగన్ జమానాలో సాగిన అక్రమాలకు ఆమోద ముద్ర వేశారు అంటే దీన్ని ఏమనుకోవాలి. వైజాగ్ లో పర్యాటక శాఖకు చెందిన యాత్రి నివాస్ లో ఆధునికీకరణ పనుల కోసం జగన్ ప్రభుత్వంలో 4 .5 కోట్ల రూపాయలతో అనుమతి మంజూరు చేశారు. అనుమతి ఇచ్చింది 4 . 5 కోట్ల రూపాయలకు. కానీ అక్కడ పనులు చేసింది మాత్రం 13 .5 కోట్ల రూపాయలకు. ఈ మొత్తానికి టూరిజం బోర్డు కానీ....ఎలాంటి అనుమతులు లేకుండానే గత ప్రభుత్వంలో పనులు చేసినట్లు క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్ధసారధి మీడియా కు వెల్లడించారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే అడ్డగోలుగా అనుమతి లేకుండా జగన్ హయాంలో చేసిన ఈ పనులకు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

అనుమతి తీసుకున్నది 4 . 5 కోట్ల రూపాయలకు..కానీ ఖర్చు పెట్టింది 13 . 5 కోట్ల రూపాయలు. అసలు ఈ మొత్తం పెడితే ఏకంగా కొత్తగా యాత్రి నివాస్ భవనమే కట్టొచ్చు అని..కానీ కేవలం ఆధునికీకరణకు ఇంత వ్యయం చేయటం..అది కూడా జగన్ హయాంలో ఎలాంటి అనుమతులు లేకుండా చేసిన పనికి ఇప్పటి క్యాబినెట్ ఆమోద ముద్ర వేయటం చూసి కొంత మంది మంత్రులు కూడా షాక్ అవుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో పర్యాటక శాఖ జనసేన కు చెందిన కందుల దుర్గేష్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పర్యాటక శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ ప్రతిపాదనను ఎలా ఆమోదించారు అన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. అంటే ఎన్ని అడ్డగోలు పనులు చేసినా క్యాబినెట్ లో పెడితే అవి సక్రమం అయిపోతాయా అని ఒక ఐఏఎస్ అధికారి విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పుడు కీలక స్థానంలో ఉన్న ఒక ఐఏఎస్ అధికారిని కాపాడేందుకే ప్రభుత్వం ఇలా చేసింది అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సహజంగా ఎప్పుడైనా ఒక పనికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన తర్వాత పది, పదిహేను శాతం అదనపు వ్యయం అయింది అంటే కొంతలో కొంత జస్టిఫికేషన్ ఉంటుంది. కానీ అనుమతి ఇచ్చింది 4 . 5 కోట్ల రూపాయలకు అయితే...అది ఏకంగా 13 . 5 కోట్లకు పెరిగింది అంటే ఇక్కడ దోపిడీ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు అని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఒక వైపు మంత్రి గత ప్రభుత్వంలో అడ్డగోలుగా చేశారు అని చెపుతూ ఇప్పుడు తాము దీన్ని ఆమోదించినట్లు చెప్పటం విశేషం. ఇది అంతా చూస్తుంటే చంద్రబాబు కు జగన్ పై ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది అనే వ్యాఖ్యలు టీడీపీ వర్గాల నుంచే వస్తున్నాయి. అయితే ప్రస్తుతం పర్యాటక శాఖలో ఉన్న అధికారులు ఈ ప్రతిపాదనపై ఎలాంటి కామెంట్స్ చేశారు అన్నది కూడా ఇప్పుడు కీలకం కాబోతుంది.

Next Story
Share it