జగన్ భయం తోనే కొత్త మోడల్స్ తెచ్చారా!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...మంత్రి నారా లోకేష్ లు పదే పదే చెప్పే పదం బ్రాండ్. వీళ్ళిద్దరూ తమ బ్రాండ్ వల్లే రాష్ట్రానికి కుప్పలు తెప్పలుగా పరిశ్రమలు...పెట్టుబడులు వచ్చిపడుతున్నాయని చెప్పుకుంటున్నారు. ఈ ప్రచారం ఒక రేంజ్ లో సాగుతోంది కూడా . కానీ వీళ్ళు చెప్పుకునే బ్రాండ్ ఏ మాత్రం వాస్తవం కాదు అని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే భారీ భారీ ప్రాజెక్ట్ లను కూడా వీళ్ళు ఏకంగా ప్రాజెక్ట్ వ్యయంలో 60 నుంచి 70 శాతం వరకూ రాయితీలు...ప్రోత్సహకాలు ఇచ్చి పారిశ్రామికవేత్తలకు వల వేస్తున్నారు. పరిశ్రమ పెట్టే వాళ్ళు ఎవరైనా తమకు ఎక్కడ ఎక్కువ లాభం ఉంటే అదే చూసుకుంటారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని ఏ మాత్రం పట్టించుకోకుండా చంద్రబాబు, నారా లోకేష్ లు పారిశ్రామిక రాయితీలు ప్రకటిస్తున్నారు అనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సంపన్నులకు మేలు చేసి వాళ్ళ ద్వారా పొగడ్తలు...వేరే రకంగా ప్రయోజనాలు పొందటం చంద్రబాబు ఎప్పటి నుంచో అమలు చేస్తున్న మోడలే అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అబిప్రాయపడ్డారు.
ప్రతికూల అంశాలను కూడా తనకు అనుకూలంగా...పాజిటివ్ గా ప్రచారం చేసుకోవటంలో చంద్రబాబు ముందు వరుసలో ఉంటారు అనే చెప్పొచ్చు. అలాంటిదే ఈ వ్యవహారం కూడా. ఏ ప్రభుత్వం అయినా రాష్ట్రానికి వచ్చే భారీ పెట్టుబడులతో పాటు ..ఇతర పరిశ్రమలకు కల్పించే రాయితీలకు సంబంధించి జీఓ లు జారీ చేస్తుంది. అందులోనే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే కంపెనీ ఏమి చేయాలి...అందుకు ప్రతిగా ప్రభుత్వం కల్పించే రాయితీలు ఏంటి అన్న విషయం స్పష్టంగా ఉంటుంది. ఎంఓ యూ లో ఈ విషయాలు మరింత స్పష్టంగా ఉంటాయి. ఇది ఎప్పటి నుంచి అమల్లో ఉన్న విధానం. ఒక ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత అది రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చిన హామీ లాంటిదే. ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. అయితే పారిశ్రామిక రాయితీల చెల్లింపుల్లో మాత్రం విపరీత జాప్యం జరుగుతూ ఉంటుంది. కొన్ని సార్లు పరిశ్రమలు ఈ రాయితీల కోసం ప్రభుత్వం చుట్టూ సంవత్సరాలకు సంవత్సరాలు తిరగాల్సి కూడా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలో ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఒక కొత్త మోడల్ తీసుకువచ్చారు.
దీని ప్రకారం రాష్ట్రం పరిస్థితి ఎలా ఉన్నా సరే పరిశ్రమలకు మాత్రం ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రాయితీలు కట్టాల్సిందే. ఎక్కడైనా ఎస్క్రో అకౌంట్స్ ను ఎలాంటి మోసాలు లేకుండా చూసుకునేందుకు వాడుతుంటారు. రెండు పార్టీలు...అంటే ఇటు ప్రభుత్వం...అటు పరిశ్రమ అంతా ఒప్పందం ప్రకారం పని పూర్తి చేసిన తర్వాత రాయితీ నిధులు వాళ్లకు చేరేలా ఏర్పాటు అన్న మాట. మరో రకంగా చెప్పుకోవాలంటే రాయితీల జీవో ఇచ్చిన తర్వాత ఒక పరిశ్రమ ప్రభుత్వాన్ని ఎస్క్రో అకౌంట్ అడిగింది అంటే ఆ ప్రభుత్వం పై నమ్మకం లేకే అని చెప్పుకోవచ్చు. ఇది ఒకెత్తు అయితే మరింత దారుణంగా ప్రోత్సహకాలు, రాయితీల విషయంలో సావరిన్ గ్యారెంటీ కూడా ఇస్తున్నట్లు చెపుతున్నారు. సావరిన్ గ్యారెంటీ అంటే ప్రభుత్వం హామీగా ఉండటం. అంటే చంద్రబాబు, నారా లోకేష్ బ్రాండ్ లు నమ్మకుండా పారిశ్రామికవేత్తలు ఎస్క్రో అకౌంట్స్...సావరిన్ గ్యారెంటీ లు అడుగుతున్నారు అనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్లు అయింది.
గతంలో కేవలం జీవోలు మాత్రమే ఇచ్చి పెట్టుబడులు సాధించిన ప్రభుత్వాలు..ఇప్పుడు పారిశ్రామికవేత్తల ముందు ఎందుకు ఇంతగా సాగిలపడాల్సి వస్తుందో అర్ధం కావటం లేదు అని ఒక అధికారి వ్యాఖ్యానించారు. భవిష్యత్ లో ఎప్పుడైనా జగన్ అధికారంలోకి వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకే ఈ ఎస్క్రో, సావరిన్ గ్యారెంటీ మోడల్ ను తెర పైకి తెచ్చినట్లు కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఒక ప్రభుత్వానికి అవమానం తప్ప మరొకటి కాదు అనే చర్చ కూడా సాగుతోంది. కానీ తెలుగు దేశం పార్టీ మాత్రం తన అధికారిక పేజీ ద్వారా దేశంలోనే తొలిసారి పారిశ్రామిక వర్గాల కోసం ఎస్క్రో ఖాతా, సావరిన్ గ్యారెంటీ విధానం అమలు చేస్తున్నాం అని..పెట్టుబడి దారులకు ఇంతకంటే ఇంకేమి కావాలి అని గొప్పగా ప్రచారం చేసుకుంటోంది.ఇవి అన్ని చూస్తుంటే నారా చంద్రబాబు, నారా లోకేష్ ల బ్రాండ్ అంతా బోగస్ అని..ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు రాయితీలు...ఈ గ్యారంటీలు చూసే రాష్ట్రం వైపు కంపెనీలు మొగ్గుచూపినట్లు కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.



