Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు తప్పులన్నీ జనసేన మెడకు కూడా!

చంద్రబాబు తప్పులన్నీ జనసేన మెడకు కూడా!
X

ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల పక్షాన ఉండాలి. అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో అధికార కూటమి పార్టీ లు మాత్రం మొన్నటి ఎన్నికల్లో భారీ మెజారిటీ తో గెలిపించిన ప్రజలు..ముఖ్యంగా రైతుల విషయంలో ఏ మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నాయి. దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నది కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న తెలుగు దేశం పార్టీ కావటంతో ఆ పార్టీ నాయకులు, క్యాడర్ మాట్లాడటం లేదు. కొంత మంది టీడీపీ అభిమానులే సోషల్ మీడియా లో మాత్రం ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. మరో వైపు కూటమిలో మరో ప్రధాన భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మౌనాన్ని ఆశ్రయిస్తూ ఆయన తన పని చేసుకుంటున్నారు. ఒక వైపు కరేడు రైతులు..మరో వైపు అమరావతి విస్తరణ ప్రాజెక్ట్ బాధిత రైతులు ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నా కూడా అవేమీ పవన్ కళ్యాణ్ కు వినిపించటం లేదు అనే చర్చ సాగుతోంది.

ఆయన ఇప్పుడు తన హర హర వీర మల్లు సినిమా విడుదల పనులు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పూర్తి చేసే పనుల్లో మునిగితేలుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అచ్చం చంద్రబాబు బాటలోనే పయనిస్తూన్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకటి..అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకటి అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. ఇండో సోలార్ కంపెనీ ఫేక్ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన నారా లోకేష్ ఇప్పుడు అదే కంపెనీ కి 8234 ఎకరాలు కట్టబెడుతున్నా ఏమి మాట్లాడటం లేదు. పైగా ఈ సంస్థ కోసం కూటమి ప్రభుత్వమే చాలా చాలా కష్టపడుతోంది. ఇదే పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు రాజధానికి 33000 ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించారు. రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరిస్తే సహించేది లేదు అంటూ హెచ్చరించారు అప్పటిలో.. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అటు అమరావతి విస్తరణ పేరుతో..ఇండో సోలార్ ప్రాజెక్ట్ కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు.

అమరావతి విస్తరణ ప్రాజెక్ట్ విషయంలో కొంత మంది రైతులు పూలింగ్ కింద భూములు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా కూడా...అదే సమయంలో ఇందుకు వ్యతిరేకించే వాళ్ళు కూడా అంతే స్థాయిలో ఉన్నారు. కొంత మంది అయితే మళ్ళీ జగన్ గెలిస్తే తమ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు కూడా . కనీసం కోర్ రాజధాని విషయంలో అంటే కొంత లో కొంత విడిపోయిన రాష్ట్రానికి రాధాదాని కావాలి కదా అనే సెంటిమెంట్ ఉంది. కానీ ఇప్పుడు విస్తరణ ప్రాజెక్ట్ విషయంలో అలాంటిది ఏమీ ఉండదు అనే చెప్పొచ్చు. అసలు రాజధాని కోసం 33000 ఎకరాలు సమీకరించి..ఇప్పుడు విస్తరణ ప్రాజెక్ట్ కోసం 42000 వేల ఎకరాలు తీసుకోవాలని క్యాబినెట్ అనుమతి తీసుకోవటమే పెద్ద విచిత్రం. గతంలో అమరావతి రైతుల తరపున నిలబడి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం ఈ విషయంపై అసలు నోరు తెరవటం లేదు. రైతుల పక్కన నిలబడితే వచ్చే ప్రయోజనం కంటే...చంద్రబాబు పక్కన నిలబడితే వచ్చే ప్రయోజనం ఎక్కువ అని పవన్ కళ్యాణ్ బహుశా ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అనే వ్యాఖ్యలు సొంత పార్టీ నాయకుల నుంచే వినిపిస్తున్నాయి. అందుకే ప్రభుత్వంలో జరిగే విషయాల్లో కూడా ఆయన అసలు తనకు ఏమీ తెలియనట్లే ఉంటున్నారు అని ఆ పార్టీ నాయకులు చెపుతున్నారు. కూటమి లో ఉన్నా మరో భాగస్వామ్య పార్టీ బీజేపీ అయితే ఏ విషయంలో కూడా ఇప్పటి వరకు మాట్లాడిన దాఖలాలు లేవు.

Next Story
Share it