Telugu Gateway
Andhra Pradesh

ఎన్నికలకు ముందే ఎన్ని విచిత్రాలో!

ఎన్నికలకు ముందే ఎన్ని విచిత్రాలో!
X

రాజకీయం ఎప్పుడో వ్యాపారం అయిపొయింది. ఎన్నికల్లో గెలిచేందుకు ముందు కొంత పెట్టుబడి పెట్టాలి...గెలిస్తే అంతకు మించి ఎన్నో రేట్లు రికవరీ చేసుకోవాలి. చాలా కాలం నుంచి ఇదే తంతు సాగుతోంది. అయితే ఏ పార్టీ అయినా కూడా ముఖ్యంగా ఎంపీ సీట్లు కోరిన వాళ్ళను ఎన్నికల బరిలో నిలవటానికి వంద కోట్లు ఖర్చుపెట్టడానికి సిద్ధమా అని ప్రశ్నిస్తాయి. ఎందుకంటే జనరల్ ఎంపీ సీట్ల లో ఆంధ్ర ప్రదేశ్ లో ఖర్చు అదే రేంజ్ లో ఉంటుంది అనే విషయం రాజకీయాలను దగ్గర నుంచి చూసే వాళ్లకు తెలుసు. ఎంపీ అభ్యర్థులు తన లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఉండే ఏడు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వటంతో పాటు తాను కూడా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక ఎమ్మెల్యే అభ్యర్ధికి డబ్బులు ఇచ్చి...కొంత మందికి ఇవ్వకపోతే వాళ్ళు ఎన్నికల ప్రచార సమయంలో తన వరకు ఓటు వేసి ఎంపీ విషయంలో మీ ఇష్టం అని ప్రచారం చేస్తారు కూడా. ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకే సారి జరుగుతాయి కాబట్టి ఈ విషయంలో చాలా చాలా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక కీలక పార్టీ ఎంపీ సీట్లు ఆశిస్తున్న వాళ్ళను 140 కోట్ల రూపాయలు డిపాజిట్ గా పెట్టాలని కోరుతున్న వ్యవహారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

ఈ మొత్తానికి లోక్ సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు 20 కోట్ల రూపాయల లెక్కన పంచాలన్నది ఆ పార్టీ ప్లాన్. అంటే సొంత ఖజానా నుంచి నిధులు కదిలించకుండా ఈ మోడల్ పెట్టుకున్నారు అన్న మాట. సీటు అడిగిన వాళ్లకు ఇదే విషయం చెపుతున్నారు...పార్టీ నాయకత్వం ఎవరినయితే ఎంపీగా బరిలో నిలపాలి అనుకుంటుందో వాళ్లకు కూడా ఇదే విషయం చెపుతున్నారు. దీంతో చాలా మంది బాబోయ్ మీ ఎంపీ సీట్లు మాకొద్దు అంటూ హ్యాండ్సప్ అంటున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఎంపీ సీట్లకు ప్రధాన పార్టీల్లో కూడా అభ్యర్థుల కొరత చాలా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో లోక్ సభ అభ్యర్థుల వేట కొనసాగుతోంది. ఒక్క ఎంపీ అభ్యర్థుల విషయంలోనే కాదు ఇప్పటికే అసెంబ్లీకి సీట్లు ఖరారు అయినా వారి విషయంలో కూడా ఇలాగే జరుగుతున్నట్లు ఆ పార్టీ వర్గాలే చెపుతున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థులు సొంతంగా సంక్రాంతి నాటికి పది కోట్లు పైగా రెడీ చేసుకోవాలని ఆదేశాలు వెళ్లినట్లు చెపుతున్నారు.

Next Story
Share it