Telugu Gateway
Andhra Pradesh

కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ అభ్యర్థుల్లో టెన్షన్!

కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ అభ్యర్థుల్లో టెన్షన్!
X

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజధాని అమరావతి అంశం ప్రభావం చూపిస్తుందా..చూపిస్తే అది ఎంత ఎంత మేర ఉండబోతుంది?. గత ఎన్నికల ముందు చంద్రబాబు కు అమరావతి లో ఇల్లు లేదు కానీ..తాను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అని అక్కడ వాళ్ళందరిని నమ్మించిన జగన్ తర్వాత మూడు రాజధానుల నినాదం అందుకున్న విషయం తెలిసిందే. జగన్ తాడేపల్లి గృహ ప్రవేశం సందర్భంగా వైసీపీ కి చెందిన నేతలు అమరావతి పై చెప్పిన మాటలు అన్నీ ఇన్నీ కావు. మరి కొద్ది రోజుల్లోనే జగన్ తొలి టర్మ్ పాలన ముగియనుంది. ఇప్పుడు అటు అమరావతి లేదు...జగన్ తెర మీదకు తెచ్చిన మూడు రాజధానులు లేవు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే చంద్రబాబు తలపెట్టిన ప్రాంతం అయిన అమరావతి లో పూర్తి స్థాయి రాజధాని ఏర్పాటు చేయటం వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ఏ మాత్రం ఇష్టం లేదు. దీని వెనక ఉన్నది ఆర్థిక కారణాల కంటే రాజకీయ కారణాలే ఎక్కువ అని చెప్పొచ్చు. మరో కీలక విషయం ఏమిటి అంటే జగన్ వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే ఎంతో ప్రశాంతంగా ఉండే విశాఖపట్నం లో రాజధాని ఏర్పాటు ఆ ప్రాంత ప్రజలకు పెద్దగా ఇష్టం లేదు అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని పత్రికల అభిప్రాయ సేకరణలో ఈ విషయం స్పష్టం అయింది. అంటే జగన్ కు అమరావతి అంటే ఇష్టం లేదు...వైజాగ్ ప్రజలకు అక్కడ రాజధాని ఏర్పాటు ఇష్టం లేదు అన్న మాట. సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు చెపుతున్నట్లు వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ గెలిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని అమరావతి అంశం ఇక చరిత్రలో మిగిలిపోయినట్లే అవుతుంది.

కానీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిస్తే మాత్రం వెంటనే కాకపోయినా కూడా వచ్చే ఐదేళ్ల కాలంలో రాజధానికి ఒక రూపు రావటం ఖాయం అని చెప్పొచ్చు. ఈ మూడు పార్టీలు కూడా ఒకే రాజధాని అమరావతి అనే విధానానికి కట్టుబడి ఉన్న విషయం తెలిసిందే. మరో సారి ఛాన్స్ వస్తే అమరావతి విషయంలో ఈ సారి చంద్రబాబు గత టర్మ్ లో చేసిన తప్పు చేయకపోవచ్చేమో. రాజధాని అమరావతి విషయంలో జగన్ గతంలో ఈ ప్రాంత ప్రజలను నమ్మించి మోసం చేసినందున అది రాజకీయంగా తమపై ఎలా ప్రభావం చూపిస్తుందో అన్న భయం ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఆ చుట్టూ పక్కల జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల్లో ఉంది. ఎన్నికల ప్రచారం పీక్ వెళ్లిన తర్వాత ఖచ్చితంగా ఈ అంశం తెరమీదకు రావటం ఖాయం అని చెపుతున్నారు. కారణాలు ఏమైనా కూడా రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత కూడా ఇంకా రాజధాని విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు గందరగోళంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు రాజధానుల విషయం ఇప్పుడు సుప్రీం కోర్ట్ లో పెండింగ్ లో ఉన్నవిషయం తెలిసిందే. కనీసం ఎన్నికల ముందు అయినా విశాఖ కేంద్రంగా పాలన సాగించేందుకు జగన్ చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలం అయ్యాయి. దీనికి సంబంధించి ఆయన పలు ముహుర్తాలు నిర్ణయించినా..ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. మే 13 న జరగనున్న ఎన్నికల తర్వాతే ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని అనిశ్చితికి తెరపడే అవకాశం ఉంది అని చెప్పొచ్చు.

Next Story
Share it