ఏపీలో కాంగ్రెస్ కొంచెం పెరిగినా వైసీపీ ఇక అంతే!
ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ నాయకులే కాకుండా ఆ పార్టీ ఓటు బ్యాంకు కూడా పూర్తిగా వైసీపీ వైపు వెళ్ళటం వల్లే జగన్ రాజకీయంగా నిలదొక్కుకోవడం తో పాటు గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసింది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తి కావస్తుండటంతో ఇదే అంశంపై ప్రజల్లో కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత కూడా తగ్గుతూ వస్తోంది. అంతే కాదు..విభజన తర్వాత తొలి సారి సీఎం అయిన చంద్రబాబు తో పాటు రెండవ సారి సీఎం అయిన జగన్ కూడా ప్రత్యేక హోదా తో పాటు కేంద్రం నుంచి విభజన హామీలు సాధించటంలో విఫలం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే ఆంధ్ర ప్రదేశ్ కు హామీ ఇచ్చినట్లు ప్రత్యేక హోదా ఇచ్చితీరుతామని చెపుతూ వస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పలు మార్లు బహిరంగంగానే ఈ విషయం ప్రకటించారు కూడా. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీ ని మరింత కలవర పెట్టే అంశం ఏమిటి అంటే వై ఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారు అనే ప్రచారం. ఇది ఏ మాత్రం వాస్తవరూపం దాల్చినా వైసీపీకి, జగన్ కు ఇరకాట పరిస్థితి తప్పదు అని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో జగన్ కోసం ప్రచారం చేసిన షర్మిల ఈ సారి కాంగ్రెస్ తరపున ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం తప్పదనే అంచనాలు వైసీపీ నేతల్లో ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు వల్ల వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు అంత ఈజీ కాదు అనే అభిప్రాయం ఉంది. ఈ రాజకీయ అంశాలకు తోడు వివిధ వర్గాల ప్రజల్లో జగన్ సర్కారుపై వ్యతిరేకత కూడా భారీగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు అన్ని చూస్తుంటే అధికార వైసీపీ కి రాబోయేది గడ్డుకాలమే అని చెప్పకతప్పదు.