Telugu Gateway
Andhra Pradesh

550 కోట్లు ఇస్తున్న ఐసిఐసిఐ..2027 కి పూర్తి

550  కోట్లు ఇస్తున్న ఐసిఐసిఐ..2027 కి పూర్తి
X

టాటా మెమోరియల్ సెంటర్‌తో (టీఎంసీ) కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (HBCHRC)లో కొత్త భావన నిర్మాణ పనులను ప్రారంభించినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. సుమారు 3.9 లక్షల చ.అ. విస్తీర్ణంలో, అత్యుత్తమ మెడికల్ టెక్నాలజీతో ఏర్పాటయ్యే ఈ అధునాతన కేంద్రం నిర్మాణానికి రూ. 550 కోట్ల పైగా మొత్తానికి కమిట్‌మెంట్‌తో ఐసీఐసీఐ బ్యాంకు నిధులను సమకూరుస్తోంది. ఎనిమిది అంతస్తుల ఐసీఐసీఐ ఫౌండేషన్ బ్లాక్ ఫర్ చైల్డ్ అండ్ బ్లడ్ క్యాన్సర్ కొత్త బిల్డింగ్ అందుబాటులోకి వచ్చాక ఏటా 3,000 మంది పేషంట్లకు సేవలందించేందుకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం విశాఖపట్నంలోని HBCHRC వార్షిక సామర్థ్యం 6,200 పేషంట్లుగా ఉంది.

తూర్పు భారతదేశంలోనే అత్యుత్తమ స్పెషలైజ్డ్ క్యాన్సర్ చికిత్సా కేంద్రాల్లో ఒకటిగా నిల్చేలా రూపొందిస్తున్న ఈ కొత్త భవనంలో 215 పైగా పడకలు ఉంటాయి. అన్ని అనుమతులకు లోబడి 2027 నాటికి ఇది పూర్తవుతుందని అంచనా. ఐసీఐసీఐ బ్యాంక్ సీఎస్ఆర్ విభాగమైన ఐసీఐసీఐ ఫౌండేషన్ ఫర్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ దీన్ని అమలును పర్యవేక్షిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా, టాటా మెమోరియల్ సెంటర్ (ముంబై) డైరెక్టర్ డాక్టర్ సుదీప్ గుప్తా సమక్షంలో ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ ప్రదీప్ కుమార్ సిన్హా కొత్త భవనం శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఇతర ప్రముఖుల సమక్షంలో ఎన్ కె రావు ఆడిటోరియంను కూడా సిన్హా ప్రారంభించారు. కొత్త ఆడిటోరియంనకు మౌలిక సదుపాయాలు, ఎక్విప్‌మెంట్‌పరంగా టిఎంసికి ఐసీఐసీఐ ఫౌండేషన్ సహాయ సహకారాలు అందించింది. “దేశీయంగా కీలక ఆరోగ్యసంరక్షణ మౌలిక సదుపాయాలను పటిష్టపర్చాలన్న మా లక్ష్యానికి అనుగుణంగా క్యాన్సర్ కేర్ విషయంలో టిఎంసితో చేతులు కలపడం మాకు ఎంతో గర్వకారణమైన విషయం. అవసరార్ధులకు అత్యంత నాణ్యమైన వైద్య సంరక్షణను అందుబాటులోకి తేవాలన్న మా నిబద్ధతకు ఈ ప్రాజెక్టు నిదర్శనంగా నిలుస్తుంది. తూర్పు కారిడార్‌లో శిశు, రక్త క్యాన్సర్‌కి సంబంధించి అతి పెద్ద ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, సమీపాన ఉన్న తూర్పు రాష్ట్రాల్లోని పేషంట్లకు సేవలందించేందుకు ఉపయోగపడుతుంది. పెరుగుతున్న క్యాన్సర్ చికిత్స అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది” అని ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ ప్రదీప్ కుమార్ సిన్హా తెలిపారు.

Next Story
Share it