Telugu Gateway
Andhra Pradesh

ప్ర‌వీణ్ ప్ర‌కాష్ అధికారాల‌కు క‌త్తెర‌

ప్ర‌వీణ్ ప్ర‌కాష్ అధికారాల‌కు క‌త్తెర‌
X

జ‌గ‌న్ స‌ర్కారులో సీనియ‌ర్ ఐఏఎస్ అదికారి ప్ర‌వీణ్ ప్ర‌కాష్ అత్యంత కీల‌కంగా ఉన్నారు. ఆయ‌న ప‌నితీరుపై ఐఏఎస్ స‌ర్కిళ్ళ‌లో ర‌క‌ర‌కాల అభిప్రాయాలు ఉన్నాయి. కొద్ది రోజుల నుంచి ఆయ‌న్ను సీఎంవో నుంచి త‌ప్పిస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది. అదే స‌మ‌యంలో ఆయ‌న ఢిల్లీ వెళ్ళే ఆలోచ‌న‌లో కూడా ఉన్న‌ట్లు క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ త‌రుణంలో ప్రవీణ్ ప్రకాష్ ను అత్యంత కీల‌క‌మైన జీఏడీ (పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శి బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించారు. ఆయన స్థానంలో జీఏడీ (పొలిటికల్‌) బాధ్యతలను ముత్యాలరాజుకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముత్యాలరాజు ప్ర‌స్తుతం సీఎం అద‌న‌పు కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. ఆయ‌న‌కు జీఎడీ పొలిటిక‌ల్ పూర్తి అద‌న‌పు బాద్య‌త‌లు అప్ప‌గించారు.

తాజా మార్పుల‌తో ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి ముఖ్య కార్యదర్శిగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. అత్యంత కీల‌క‌మైన‌ జీఏడీ పొలిటిక‌ల్, సీఎం ముఖ్య కార్య‌ద‌ర్శి వంటి రెండు పోస్టులు ఒక్క‌రికే ఇవ్వ‌టం ఏ మాత్రం స‌రికాద‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి. అయితే ముఖ్య‌మంత్రికి న‌చ్చిన అధికారి కావంటంతో ఈ వ్య‌వ‌హరంపై పెద్ద‌గా ఎవ‌రూ బ‌హిరంగంగా వ్యాఖ్యానించ‌టానికి ఇష్ట‌పడేవారు కాదు. అయితే ప‌లుమార్లు ప్ర‌వీణ్ ప్ర‌కాష్ వ్య‌వ‌హ‌ర‌శైలితో చాలా మంది అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్న‌ట్లు చెబుతారు. సీఎంవోలో అత్యంత కీల‌క‌మైన స్థానంలో ఉండ‌టంతో చాలా మంది అదికారులు ఆయ‌న ఒత్తిడికి తలొగ్గ‌క త‌ప్ప‌లేద‌ని..చెప్పిన వెంట‌నే ప‌నులు కావాల‌ని హుకుంలు జారీ చేసిన‌ట్లు అదికార వ‌ర్గాలు తెలిపాయి.

Next Story
Share it