Top
Telugu Gateway

నా సర్వీసులో ఇలాంటి వ్యాఖ్యలు చూడలేదు

నా సర్వీసులో ఇలాంటి వ్యాఖ్యలు చూడలేదు
X

పోలీసులు మతాలు..కులాలకు అతీతంగా రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటారని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ వ్యాఖ్యానించారు. దేవాలయాలపై దాడులకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు వ్యాప్తిచేసినా ప్రజలు సంయమనంతో వ్యవహరించారన్నారు. కొంత మంది కావాలనే వాస్తవాలను వక్రీకరిస్తున్నారని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ''కోవిడ్ సమయంలో పోలీసులు చాలా కష్టపడ్డారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పోలీసులు చొరవ తీసుకున్నారు. కరోనాతో 109 మంది పోలీసులు మరణించారు. పోలీసులు లాక్‌డౌన్‌, కరోనాను ఛాలెంజ్‌గా తీసుకుని పనిచేశారు. టెక్నాలజీ విభాగంలో ఏపీ పోలీస్ శాఖకు 100కుపైగా అవార్డులు వచ్చాయి. గతంతో పోలిస్తే నేరస్థుల అరెస్ట్, శిక్ష విషయంలో పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారు.

రాజకీయ కారణాలతో పోలీసులపై ఆరోపణలు చేయడం సరికాదు. ఆలయాలకు సంబంధించి మొత్తం 44 కేసులు ముఖ్యమైనవి. ఆలయాలపై దాడులు జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని 58, 871 హిందూ ఆలయాలను జియో ట్యాగింగ్ చేశాం. ఆలయాల భద్రతపై సమీక్షించాం. 13వేల ఆలయాల్లో 43వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. గడిచిన రెండు నెలల్లోనే 30వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాం. హిందూ దేవాలయాల విషయంలో దేశంలో ఎక్కడాలేని విధంగా భద్రతా చర్యలు చేపట్టాం. మూడు నెలల కిందటే రామతీర్థం ఆలయంలో భద్రత పెంచాలని సూచించాం. ప్రధాన ఆలయంలో అదనంగా 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాం.' అని తెలిపారు.

Next Story
Share it