Telugu Gateway
Andhra Pradesh

ఇండియా టుడే ఇంటర్వ్యూ లో జగన్ సంచలన వ్యాఖ్యలు

ఇండియా టుడే ఇంటర్వ్యూ లో జగన్ సంచలన వ్యాఖ్యలు
X

ఈ మాట ఎవరో చెపుతున్నది కాదు. స్వయంగా వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పిందే. రాజకీయాల్లో పార్టీ బలమే ప్రధానమైనది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అయితే పార్టీ బలానికి తోడు ఎంతో కొంత ఆయా నియోజకవర్గాల్లో...జిల్లాల్లో ఉండే నేతల బలం కూడా విస్మరించలేనిది. పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థులకు నిజంగా ఎలాంటి బలం లేదు..ఉండదు ...కేవలం తమ ఇమేజ్...తమ ప్రభుత్వ పనితీరు ఆధారంగానే ప్రజలు ఓట్లు వేస్తారు అని ఏ నాయకుడు అయినా భావిస్తే అప్పుడు ఎవరికి పడితే వాళ్లకు టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలి కదా. అలా కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు ఎంపీ టికెట్స్, ఎమ్మెల్యే టికెట్ లు ఇచ్చారు అంటే ఆయా వ్యక్తులకు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న బలం ఆధారంగానే ఇచ్చినట్లు కదా?. నిజంగా అలాంటిది ఏమి లేకపోతే వైసీపీ అధినేత జగన్ ఎవరిని నిలబెట్టినా ఆ అభ్యర్థి అలవోకగా గెలిచిపోవాలి. తాజాగా జగన్ ఇండియా టుడే టీవీ కన్సల్టింగ్ ఎడిటర్ రాజదీప్ సర్దేశాయ్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోనే జగన్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ ఐదేళ్ల పాలన అంత అద్భుతంగా ఉంది అని భావించినప్పుడు 151 మంది ఎమ్మెల్యేల్లో 81 మంది ఎమ్మెల్యేలను ఎందుకు అటు ఇటు మార్చినట్లు..వాళ్లపై ప్రజల్లో వ్యతిరేకత అని ప్రశ్నిస్తే...అటు ప్రభుత్వంపై కానీ...ముఖ్యమంత్రి పనితీరుపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు అని జగన్ చెప్పారు. కొంత మంది ఎమ్మెల్యేలపై ఉంటే వ్యతిరేకత ఉండొచ్చు అని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన 151 మందిలో ఏకంగా ఏభై శాతం పైన 81 మందిని మార్చి అంటే..కొంత మందికి టికెట్ ఇవ్వకుండా..మరి కొంత మంది నియోజకవర్గాలు మార్చటంపై స్పందిస్తూ ఇది తనపై తనకు ఉన్న నమ్మకాన్ని సూచిస్తుంది జగన్ అన్నారు. అంటే మీరు మీ పేరు మీద మాత్రమే ఓట్లు అడుగుతున్నారా అంటే ఎస్ అని జగన్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ల పేరు మీద కాదు అని...తన మీరు మీద ఓట్లు అడుగుతున్నాననని..తాను ఎక్కడకు వెళ్లినా కూడా ఇది ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు అని..ఇది మీ భవిష్యత్ కు చెందిన ఎన్నిక అని..జగన్ తో మీ భవిష్యత్ బాగుంటుంది, సురక్షితంగా ఉంటుంది అనుకుంటే...మీకు మేలు జరుగుతుంది అనుకుంటే వైసీపీ కి ఓటు వేయమని అడుగుతున్నట్లు తెలిపారు.

మంచి పరిపాలన ఉంది అనుకుంటే..మీకు లాభం జరిగింది అనుకుంటేనే ఓటు వేయమని అడుగుతున్న పార్టీ తమది ఒకటే అని జగన్ తెలిపారు. సీఎం గా జగన్ ఉండబట్టే ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు ప్రజలకు చేసింది అని...ఆ మేరకు తాను పరిపాలన అందించినట్లు తెలిపారు. ప్రజలకు తనపై విశ్వాసం ఉంది అని జగన్ వ్యాఖ్యానించారు. తొలి టర్మ్ లోనే జగన్ అసలు ఎమ్మెల్యేలను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ సారి ఏకంగా వాళ్ళ (ఎమ్మెల్యే అభ్యర్థుల) దయాదాక్షిణ్యాలపై కాకుండా తన పేరు మీదే వైసీపీ కి ఓటు వేయాలని కోరుతున్నట్లు చెప్పటం ద్వారా జగన్ వైసీపీ అభ్యర్థులు జీరో...జగన్ మాత్రమే హీరో అని చెప్పినట్లు అయింది అనే చర్చ సాగుతోంది. ఒక వైపు తానే స్వయంగా ఎమ్మెల్యేలది ఏమి ఉండదు అంతా చేసేది తాను మాత్రమే అని చెప్పుకుంటూ మళ్ళీ టికెట్స్ కేటాయింపు విషయం దగ్గరకు వచ్చేసరికి సామజిక న్యాయం వంటి పెద్ద పెద్ద మాటలు చెపుతారు.

Next Story
Share it