లోకేష్ అంటే ప్రభుత్వం...ప్రభుత్వం అంటే లోకేషేనా?!

ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హవా అంతా నారా లోకేష్ దే అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ఉంది. అధికారుల పోస్టింగ్ ల దగ్గర నుంచి కీలక నియామకాల్లో కూడా నారా లోకేష్ మాటే చెల్లుబాటు అయింది అని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ సారి అంతా నారా లోకేష్ కే అప్పగించారు అనే చర్చలు కూడా టీడీపీ నాయకుల్లో కూడా సాగుతున్నాయి. తెర వెనక వ్యవహారాలు ఎలా ఉన్నా కూడా ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని పద్ధతులు పాటించాలి. కానీ నారా లోకేష్ మాత్రం ప్రభుత్వం అంటే అంతా తానే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు అనే చర్చ ఆంధ్ర ప్రదేశ్ మంత్రుల్లో సాగుతోంది. సోమవారం నాడు నారా లోకేష్ మీడియా తో నిర్వహించిన చిట్ చాట్ ఈ కొత్త విమర్శలకు కారణం అయింది. ఏపీలో ఇప్పుడు అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే...నారా లోకేష్ యాక్టింగ్ ముఖ్యమంత్రి గా వ్యవహరిస్తున్నారు అని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు.
నారా లోకేష్ చూసేది మాననవనరులు...ఐటి శాఖలు. కానీ ఆయన తన శాఖకు ఏ మాత్రం సంబంధము లేని దేవాదాయ శాఖకు సంబంధించిన అంశంపై అత్యంత కీలక ప్రకటన చేశారు. జగన్ సీఎం గా ఉన్న సమయంలో తిరుమల పరకామణి లో చోటు చేసుకున్న అక్రమాలపై సిట్ వేయబోతున్నట్లు మీడియా కు చెప్పారు...ఈ వార్త మీడియాలో ప్రముఖంగా కూడా వచ్చింది. జగన్ హయాంలో పరకామణిలో చోటు చేసుకున్న అక్రమాలు...ఇందులో సాగిన సెటిల్మెంట్స్ విషయంలో నిజాలు నిగ్గుతేల్చి...దేవుడి సొమ్ము కాజేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాల్సిందే . ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే దేవాదాయ శాఖకు చెందిన సీనియర్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోమ్ మంత్రి వంగలపూడి అనితలకు ఏ మాత్రం సంబంధము లేకుండా నారా లోకేష్ ఇప్పుడు నేరుగా ఈ వ్యవహారంపై సిట్ వేస్తామని ప్రకటించటం అటు రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అసలు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఇలాంటి విధాన ప్రకటన బయట చేయటం కూడా సరికాదు అని ఒక మంత్రి వెల్లడించారు. ఇంతటి కీలక విషయంలో క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం ప్రకటించాలి కాని..నారా లోకేష్ ప్రభుత్వం అంటే నేనే...నేనే ప్రభుత్వం అన్న చందంగా సిట్ పై ప్రకటన చేయటం ఏ మాత్రం సరికాదు అని టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇది ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుంది అని చెపుతున్నారు. పైగా ఈ శాఖతో నారా లోకేష్ కు ఏ మాత్రం సంబంధము లేదు అనే విషయం తెలిసిందే. గతంలో కూడా నారా లోకేష్ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పరిశ్రమల శాఖ విషయంలో కూడా ఆ శాఖ మంత్రి టి జీ భరత్ ను పక్కన పెట్టి ఆయనే అన్నీ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.
నారా లోకేష్ వ్యవహరిస్తున్న తీరుపై క్యాబినెట్ లోని కొంత మందిమంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నా కూడా వాళ్ళు మౌనంగానే కొనసాగుతున్నారు. ఎందుకంటే అనధికారికంగా హవా అంతా నారా లోకేష్ దే కాబట్టి అని ఒక మంత్రి వెల్లడించారు. గత కొన్ని రోజులుగా పరకామణి వ్యవహారంపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య రాజకీయ విమర్శలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఈ తరుణంలో తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి కూడా ఈ విషయంలో సిబిఐ విచారణ జరిపించాలని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు...సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా లేఖ రాశారు. ఆ తర్వాత నారా లోకేష్ ఈ వ్యవహారంలో సిట్ ప్రకటన చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.



