Telugu Gateway
Andhra Pradesh

ఏ లెక్కలు లేకుండానే ఎయిర్ పోర్ట్ భూమి లెక్కలు ఎలా తేల్చారో!

ఏ లెక్కలు లేకుండానే ఎయిర్ పోర్ట్  భూమి లెక్కలు ఎలా తేల్చారో!
X

బనకచెర్ల ప్రాజెక్ట్ డీపీఆర్ ఖరారు కాక ముందే ఈ పనులు ఏ కాంట్రాక్టు సంస్థ కు దక్కబోతున్నాయో పేరు బయటకు వచ్చేస్తుంది. అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు. అసలు ఏ నివేదికలు సిద్ధం కాకముందే ఎయిర్ పోర్టు డెవలపర్ ఎవరో ఫిక్స్ అయిపోతారు. ఆ ఎయిర్ పోర్టు కు ఎంత భూమి అవసరమో తేల్చేస్తారు. వీటికి ట్రాఫిక్ లెక్కలు అవసరం లేదు...ఏ శాస్త్రీయ విధానం ఉండదు. ఎందుకంటే ఇవి అన్ని కూడా ఒక పక్కా ముందస్తు ప్లాన్ ప్రకారం సాగిపోతాయి. ఎంపిక చేసిన కాంట్రాక్టర్లు...కంపెనీలకు మేలు చేసేలా ముందే ఒక ఎజెండా ఫిక్స్ అయిపోతుంది. దీనికి తమ వంతు సహకరించే ఐఏఎస్ అధికారులు కూడా కోట్ల రూపాయల మేర ప్రయోజనం పొందుతారు అని అధికారులే చెపుతున్నారు. ఏపీలో ప్రస్తుతం అమలు అవుతున్న మోడల్ ఇదే అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే నాలుగేళ్లలో ఇంకెన్ని విచిత్రాలు జరుగుతాయో ఆలోచించటానికే భయం వేస్తుంది అంటున్నారు ఆయన.

ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అంటేనే చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అమరావతికి ఎంతో దగ్గరలోనే గన్నవరం ఎయిర్ పోర్టు ఉంది. ఇప్పుడు అది విస్తరణ దశలో ఉంది. ఈ ఎయిర్ పోర్టు విస్తరణ కోసం గతంలో భూములు సమీకరించి రాజధాని అమరావతిలో వాళ్లకు ప్లాట్స్ కూడా ఆఫర్ చేశారు. కానీ సడన్ గా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఏకంగా రాజధాని అమరావతి ప్రాంతంలో నాలుగు నుంచి ఐదు వేల ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కట్టాలని ప్రతిపాదించి...దీనికి సంబదించిన సాద్యా సాధ్యాలు...సాంకేతిక, ఆర్థిక అంశాలతో కూడిన నివేదిక సిద్ధం చేసేందుకు ఆర్ఎఫ్ పీ జారీ చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం విజయవాడ నుంచి దగ్గర దగ్గర పన్నెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు గణాంకాలు చెపుతున్నాయి. కానీ అదే గత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి రాకపోకలు సాగించిన ప్రయాణికుల సంఖ్య 2 .13 కోట్లు గా ఉంది. శంషాబాద్ ఎయిర్ పోర్టు కే 5500 ఎకరాలు ఉంటే ఇప్పుడు అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కోసం ఏకంగా నాలుగు వేల నుంచి ఐదు వేల ఎకరాలు కావాలని లెక్కలు వేస్తున్నారు అంటే దీని వెనక ఎజెండా ఏంటో ఊహించటం పెద్ద కష్టం కాదు.

పరిశ్రమలు...ఎయిర్ పోర్టు ల పేరు చెప్పి వేల ఎకరాలు బడా బాబుల చేతుల్లో పెట్టి సదరు కార్పొరేట్ సంస్థల అధినేతలు ఫోర్బ్స్ జాబితాలో ఎక్కేలా చూడటం...వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున ఆర్థికంగా లాభం పొందటం. ఎప్పటి నుంచో ఇదో మోడల్ ఫాలో అవుతున్నారు కొంత మంది నేతలు . ఇంతవరకు అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కు సంబంధించి సాంకేతిక, ఆర్థిక సాద్యా సాద్యాల నివేదికే సిద్ధం కాలేదు...ట్రాఫిక్ లెక్కలు లేవు..కానీ ఏకంగా ఎయిర్ పోర్టు కు అవసరం అయ్యే ల్యాండ్ లెక్కల్లో మాత్రం ఒక అంచనాకు వచ్చేశారు. అదెలా సాధ్యం?. ఇంకా ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే అమరావతిలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఇప్పటికే ఒక ప్రముఖ సంస్థ ఆసక్తికనపర్చింది అని ఒక ప్రధాన పత్రిక రాసేసింది. అంటే అసలు నివేదికలు ఏమి సిద్ధం కాకముందే కంపెనీ రెడీ అయింది అంటే అంతా తెర వెనక సిద్ధం చేసుకునే ఈ కసరత్తు మొదలు పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. ఎంత విజన్ ఉంటే ఇంత పక్కాగా స్కెచ్ వేయగలరు మరి.

Next Story
Share it