మెడికల్ కాలేజీలపై డొల్ల వాదనతో అభాసుపాలు!

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని నిర్ణయించిన ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి సర్కారు ఈ నిర్ణయాన్ని సమర్ధించుకోవటానికి నానా తంటాలు పడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం చెపుతున్న లెక్కలు...అధికారికంగా టీడీపీ పేస్ బుక్ లో పెడుతున్న పోస్ట్ లు చూసి అవాక్కు అవటం అందరి వంతు అవుతోంది. ఇదే చంద్రబాబు సర్కారు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో చేపట్టిన అరవై వేల కోట్ల రూపాయలకు పైగా పనులను మూడేళ్ళలో పూర్తి చేయలని టార్గెట్ గా పెట్టుకుంది. ఈ టర్మ్ లో అమరావతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన ప్రకారం పూర్తి చేయకపోతే రాజకీయంగా టీడీపీ కచ్చితంగా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇదే అభిప్రాయంలో టీడీపీ నేతలు కూడా ఉన్నారు. అరవై వేల కోట్ల రూపాయలకు పైగా పనులను మూడేళ్లలో పూర్తి చేయలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని పదిహేడు మెడికల్ కాలేజీ లు పూర్తి చేయటానికి 20 నుంచి 25 సంవత్సరాలు పడుతుంది అని లెక్కలు చెప్పటం చూసి ఐఏఎస్ అధికారులు కూడా విస్తుపోతున్నారు.
గత ప్రభుత్వ విధానం ప్రకారం అయితే ఇంత సమయం పడుతుంది అని...అదే పీపీపీ విధానంలో అయితే రెండు నుంచి రెండున్నరేళ్లలో పూర్తి చేయవచ్చు అని అధికారికంగా టీడీపీ తన పేస్ బుక్ పేజీ లో పెట్టింది. ఇప్పుడు అమరావతి లో భారీ ప్రాజెక్ట్ లను మూడేళ్ళలో టార్గెట్ పెట్టుకున్న సర్కారు 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేయటానికి మాత్రం 20 నుంచి 25 సంవత్సరాలు పడుతుంది అని చెప్పటం విచిత్రంగా ఉంది అని అధికార వర్గాలు చెపుతున్నాయి. నిజంగా ప్రభుత్వానికి ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే అమరావతి ప్రాజెక్ట్ ల కోసం ఏర్పాటు చేసినట్లు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ ) ఏర్పాటు చేసి ఈజీ గా వీటిని కూడా పూర్తి చేయవచ్చు అని అధికార వర్గాలు చెపుతున్నాయి. అప్పుడు ఈ కాలేజీలకు నిధుల సమీకరణ కూడా పెద్ద కష్టం కాబోదు అని చెపుతున్నారు. కానీ కూటమి సర్కారు గత ప్రభుత్వం ...జగన్ మోహన్ రెడ్డి అసంపూర్తిగా వదిలిపెట్టి వెళ్లిపోయిన మెడికల్ కాలేజీలను ఒక వ్యూహం ప్రకారమే పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులు..సంస్థలకు కేటాయించటానికి సిద్ధం అయింది అని చెపుతున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మెడికల్ కాలేజీల నిర్మాణానికి అవసరం అయ్యే నిధులు సమీకరించటం ఏ మాత్రం కష్టం కాదు అని...ప్రజలకు ఎంతో మేలు చేసే ఇలాంటి వాటిని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వటం ఏ మాత్రం సరికాదు అని ఆయన ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు. రాజకీయంగా జగన్ ఫెయిల్యూర్స్ ను...జగన్ హయాంలో వీటిని కట్టకుండా ఇతర పనులపై ఫోకస్ పెట్టారు అనే విమర్శలు చేయటం వరకు ఓకే కానీ..ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలి అంటే 20 నుంచి ఏకంగా 25 సంవత్సరాలు పడుతుంది అనే ఒక డొల్లవాదన తీసుకురావడంతో ప్రభుత్వ ఉద్దేశం ఏంటో అర్ధం అవుతుంది. జగన్ మోడల్ లో తప్పులు ఉంటే వాటిని సరిదిద్ది మరింత మెరుగ్గా మార్చే అధికారం కూటమి ప్రభుత్వానికి ఉంది. కానీ చేయకుండా కుంటి సాకులు వెతికే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే మెడికల్ కాలేజీల వ్యవహారంలో కూటమి సర్కారు ఇరకాటంలో పడినట్లు ఉంది అనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా లో సైతం ప్రభుత్వ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలే వినిపిస్తున్నాయి.



