Telugu Gateway
Andhra Pradesh

దరఖాస్తు చేస్తే తొంభై రోజుల్లో ఇళ్ళ పట్టా

దరఖాస్తు చేస్తే తొంభై రోజుల్లో ఇళ్ళ పట్టా
X

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం అయిన ఇళ్ళ పట్టాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే క్రిస్మస్ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ సోమవారం నాడు శ్రీకాళహస్తిలో జరిగిన ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. 'రాష్ట్ర వ్యాప్తంగా నేడు పండుగ జరుగుతోంది. సొంతిళ్లు లేని నిరుపేదల్లో చిరునవ్వు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 30.75లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నాం. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నాం. శ్రీకాళహస్తిలో 7 లక్షల రూపాయల విలువైన ప్లాట్‌ను అక్కాచెల్లెమ్మలకు ఇస్తున్నాం' అన్నారు. అమ్మ ఒడి, చేయూత, వసతి దీవెన వంటి పథకాల ద్వారా నేరుగా మహిళలకే నగదు అందిస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. అవినీతికి తావు లేకుండా నేరుగా అక్కాచెల్లెమ్మల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం అన్నారు ఇళ్ళ పట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియగా మార్చామని.. అర్హులైనవారు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో.. ఇంటి స్థలం కేటాయించేలా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. 'తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సహా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. లే అవుట్ విస్తీర్ణం బట్టి పార్క్‌ లు, అంగన్‌వాడీలు, విలేజ్‌ క్లీనిక్‌లు, ఆర్‌బీకేలు ఏర్పాటు చేస్తాం.

224 చదరపు అడుగుల నుంచి 340 చదరపు అడుగులకు విస్తీర్ణం పెంచాం. 300 చదరపు అడుగులు ఉన్న టిడ్కో ఇళ్లను ఒక రూపాయికే అందిస్తున్నాం. టిడ్కో ఇళ్లను పూర్తి చేసేందుకు 9వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నాం' అన్నారు. 'లక్షా 43వేల మంది టిడ్కో లబ్ధిదారుల్లో ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీం కావాలన్నారు. 365, 430 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లల్లో.. 50శాతం లబ్ధిదారుల వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనివల్ల ప్రభుత్వంపై 4,250 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది' అన్నారు. 'ఇళ్ల స్థలాల పంపిణీలో కులం, మతం, పార్టీ వంటి బేధాలు చూడలేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటిని అందిస్తున్నాం. పారదర్శకతలో భాగంగా లబ్దిదారుల జాబితాను గ్రామ సచివాలయంలో పెడుతున్నాం' అని తెలిపారు.

Next Story
Share it