ఏపీలో ఇళ్ళ స్థలాల మంజూరుకు ముహుర్తం ఖరారు
వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ సర్కారు కొత్త ముహుర్తం నిర్ణయించింది. కోర్టు కేసులు ఉన్న చోట మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో ఈ పట్టాలు పంపిణీ చేయాలని తలపెట్టారు. దీనికి డిసెంబర్ 25ను ముహుర్తంగా నిర్ణయించారు. డిసెంబర్ 25న అర్హులకు డి-ఫామ్ పట్టా ఇచ్చి ఇంటి స్థలం కేటాయించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 30,68,281మంది లబ్ధిదారులను గుర్తించారు. వీరందరికి పట్టాలు అందించడంతో పాటు అదే రోజు ఇళ్ల నిర్మాణాలు మెదలుకానున్నాయి.
తొలి దశలో దాదాపు 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. వాస్తవానికి జూలై 8నే ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇళ్ళ పట్టాల అంశం కోర్టులకు వెళ్లడంతో పలుమార్లు వాయిదా పడింది. కొత్తగా ఇచ్చే ఇళ్ళ పట్టాల విషయంలో విశాలమైన రోడ్లు, పార్కులు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర సామాజిక అవసరాల కోసం స్థలాలు కేటాయించారు. ఇల్లు లేదనే వారు ఉండకుండా సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందజేయాలని నిర్ణయించారు.