రాష్ట్రం అప్పుల్లో ..పార్టీలు..అధినేతలు మాత్రం సూపర్ రిచ్!

ఆంధ్ర ప్రదేశ్ అప్పుల్లో ఉన్నా...రాష్ట్రంలోని పార్టీ లు ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నాయో చెప్పే ఘటన ఇది. గతంలో చాలా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలతో క్యాంపులు ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే ఒక రాష్ట్రానికి చెందిన వాళ్ళను మరో రాష్ట్రంలోని రిసార్ట్ ల్లో పెట్టి వాళ్లకు సకల సౌకర్యాలు కల్పించే వాళ్ళు. కానీ ఇప్పుడు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ)కి చెందిన కార్పొరేటర్లను అన్ని పార్టీ లు విదేశాలకు పంపి క్యాంపులు ఏర్పాటు చేశాయి. బహుశా విదేశాల్లో కార్పొరేటర్లతో క్యాంపు లు పెట్టిన రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ కొత్త రికార్డు నెలకొల్పి ఉంటుంది అనే చర్చ సాగుతోంది. రాష్ట్రంలోని కూటమి పార్టీలు అయిన టీడీపీ, జనసేన, బీజేపీ లతో పాటు వైసీపీ కూడా ఈ జాబితాలో ఉంది. అన్ని పార్టీలకు చెందిన కార్పొరేటర్లు ఇప్పుడు విదేశాల్లో మకాం వేసి ఉన్నారు. కూటమి పార్టీల కార్పొరేటర్లు మలేసియా లో ఉంటే..వైసీపీ కి చెందిన కార్పొరేటర్లు శ్రీలంక లో మకాం వేసి ఉన్నారు అని ఆయా పార్టీల నేతలు చెపుతున్నారు. వీళ్ళు అంతా ఏప్రిల్ 18 నే వైజాగ్ కు తిరిగిరానున్నారు.
ఏప్రిల్ 19 న జరిగే జీవిఎంసి సమావేశంలో కూటమి పెట్టిన అవిశ్వాస తీర్మానం భవితవ్యం తేలనుంది. విశాఖ మేయర్ పీఠం ప్రస్తుతం వైసీపీ చేతిలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత కీలకమైన వైజాగ్ మేయర్ పీఠం దక్కించుకోవటం కోసం అధికార టీడీపీ స్కెచ్ వేసి దీన్ని అమలు లో పెట్టింది. అందులో భాగంగానే మేయర్ హరి వెంకట కుమారి పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఇప్పటికే చాలా మంది వైసీపీ కార్పొరేటర్లు అధికార కూటమి వైపు వెళ్లిపోయారు. ఇందులో కొంత మంది టీడీపీ లో చేరితే మరి కొంత మంది జనసేన లో చేరారు. అవిశ్వాస తీర్మానం నెగ్గకుండా చూసుకునేందుకు వైసీపీ గట్టి ప్రయత్నాలు చేసినా కూడా ఇది పెద్దగా ఫలితాన్ని ఇచ్చే సూచనలు కనిపించటం లేదు. ఎందుకంటే కూటమి నేతలు ఇప్పటికే జీవిఎంసి లో మేయర్ పీఠం దక్కించుకోవడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ సాధించినట్లు చెపుతున్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత కూటమి తరపున మేయర్ పీఠం టీడీపీ నే దక్కించుకోనుంది.
వైజాగ్ కార్పొరేటర్లను ప్రధాన పార్టీ లు ఏకంగా విదేశాలకు తీసుకు వెళ్లి మరీ క్యాంపులు నిర్వహించిన విషయం జాతీయ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. తాము విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం అని పదే పదే ప్రకటించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎలా వ్యవహరించిందో ఆయన కూడా ఇప్పుడు అదే మోడల్ ఫాలో అవుతున్నారు. మొత్తానికి వైజాగ్ కార్పొరేటర్ల వ్యవహారంతో ఏపీ పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి. వైజాగ్ మేయర్ పీఠం చేజారకుండా చూసే బాధ్యతను వైసీపీ ఆ పార్టీకి చెందిన కీలక నేత, మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణకు అప్పగించినా ఇప్పుడు అదేమీ పెద్దగా వర్క్ అవుట్ అయ్యేలా లేదు అని చెపుతున్నారు.