పొత్తుపై పెరుగుతున్న అనుమానాలు!
విశాఖ అభివృద్ధికి భవిష్యత్తులో కూడా కృషి చేస్తానని తెలిపారు. త్వరలోనే విశాఖకు వస్తానని....తన అనుచరులతో కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తానని అన్నారు. విశాఖలోనూ, రాష్ట్రంలో బీజేపీ జెండా రెపరెపలాడే విధంగా కార్యాచరణ రూపొందించుకుందామని ఎంపీ జీవీఎల్ నరసింహరావు తెలిపారు. కానీ జీవీఎల్ ఎక్కడా కూడా కూటమిలో ప్రధాన పార్టీ గా ఉన్న టీడీపీ తరపున వైజాగ్ లోక్ సభ బరిలో ఉన్న భరత్ కు ఓటు వేయాలని మాట మాత్రంగా అయినా కూడా చెప్పకపోవటం చర్చనీయాంశంగా మారింది. జీవీఎల్ చెపితే ఓట్లు వస్తాయా రావా అన్నది వేరే విషయం. కానీ ఏపీ బీజేపీ లో ఒక కీలక నేతగా ...రాజ్య సభ సభ్యుడిగా ఉన్న ఆయన అధికారికంగా పొత్తు పెట్టుకున్న పార్టీ అభ్యర్థి గురించి ఎన్నికల సమయంలో ఒక మాట కూడా మాట్లాడక పోవటంతో బీజేపీ ఈ కూటమి విషయంలో ఎంత సీరియస్ గా ఉందో అర్ధం చేసుకోవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగితే ముఖ్యంగా బీజేపీ కి ఓటు ట్రాన్స్ఫర్ జరగటం కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పొత్తులో భాగంగా బీజేపీ కి ఆరు లోక్ సభ, పది అసెంబ్లీ సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. మరో వైపు జీవిఎల్ మొదటి నుంచి కూడా అధికార వైసీపీ కి అనుకూలంగా ఉంటారు అనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. దీన్ని బలపర్చేలా తాజాగా అయన వీడియో సందేశంలో చేసిన వ్యాఖ్యలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.