Telugu Gateway
Andhra Pradesh

శ్రీకాకుళంలో కూడా

శ్రీకాకుళంలో కూడా
X

ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే వైజాగ్ లోని భోగాపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సిద్ధం అవుతోంది. ఈ ఎయిర్ పోర్ట్ 2026 సంవత్సరం నాటికీ అందుబాటులోకి రానుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో కొత్తగా మరో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఒక్క అమరావతిలోని కాదు...శ్రీకాకుళంలో కూడా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కూడా అమరావతి పనులు అనుకున్నంత వేగంగా ముందుకు సాగటం లేదు అనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణే స్వయంగా 2024 డిసెంబర్ నుంచి అమరావతి పనులు ప్రారంభం అవుతాయి అని పలు మార్లు ప్రకటించారు. కానీ ఈ దిశగా పనుల వేగం ఎక్కడా పెరగలేదు . ఈ తరుణంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అమరావతి తో పాటు శ్రీకాకుళంలో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ ఎయిర్ పోర్ట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఇటీవల ఈ విమానాశ్రయం ఏర్పాటు కోసం సాంకేతిక, ఆర్థిక అంశాలతో కూడిన సాధ్యాసాధ్యాల నివేదిక (టిఈఎఫ్ఆర్) సిద్ధం చేసేందుకు రిక్వెస్ట్ ఫర్ ప్రొపోజల్స్ (ఆర్ఎఫ్ పీ) జారీ చేసింది. అమరావతిలో కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేస్తే ఎంత వ్యయం అవుతుంది...ఎంత ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంది...విమానాశ్రయం తో పాటు ఎంఆర్ఓ ఫెసిలిటీ కి ఛాన్స్ ఉందా వంటి అంశాలతో కొత్తగా ఎంపిక చేసే కన్సల్టెంట్ తన నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి 32 వారాల గడువు విధించారు. కన్సల్టెంట్ సంస్థే ఎయిర్ పోర్ట్ కు సరైన సైట్ ను ఎంపిక చేయాల్సి ఉంటుంది.

దీంతో పాటు ప్రతిపాదిత ప్రాజెక్ట్ కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్, ఫైనాన్సియల్ మోడల్, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ కూడా సూచించాల్సి ఉంటుంది. పర్యావరణ, సామాజిక ప్రభావ నివేదికలు సిద్ధం చేసి...వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతులు పొందేందుకు కూడా సహకరించాల్సి ఉంటుంది అని ఆర్ఎఫ్ పీ లో పేర్కొన్నారు. వీటితో పాటు ప్రతిపాదిత ప్రాంతంలో ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏర్పాటుకు గల అవకాశాలపై కూడా అధ్యయనం చేయాలి. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల ట్రాఫిక్ తో పాటు కార్గో ట్రాఫిక్ డిమాండ్ వచ్చే 35 సంవత్సరాల్లో ఎలా ఉండబోతుంది అన్నది నివేదిక సిద్ధం చేయాలి. పీపీపీ లేదా జాయింట్ వెంచర్ మోడ్ లోనే ఈ ప్రాజెక్ట్ చేపట్టాలా అనే అంశంపై కూడా కన్సల్టెంట్ సూచించాల్సి ఉంటుంది. కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామ్ మోహన్ నాయుడు ఉన్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఈ రెండు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్స్ ప్రాజెక్ట్ లు ఎంత మేర ముందుకు సాగుతాయి అన్నది రాబోయే కాలంలో కానీ తేలదు.

Next Story
Share it