Telugu Gateway
Andhra Pradesh

ఐదు నెలల్లోనే మూడు జిల్లాల్లో అనుమతులు

ఐదు నెలల్లోనే మూడు జిల్లాల్లో అనుమతులు
X

వేలకు వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు

అదే ప్రమోటర్లకు మొత్తం ఐదు చోట్ల అనుమతులు

అంతా మా ఇష్టం. అది అమరావతి కాంట్రాక్టు లు అయినా..విద్యుత్ ప్రాజెక్ట్ లు అయినా. నచ్చిన వాళ్లకు ఎన్నైనా ఇస్తాం. ఎలాగైనా ఇస్తాం అన్నట్లు ఉంది ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు. ఆంధ్ర ప్రదేశ్ లో గత కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూసి కొంత మంది ఐఏఎస్ అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు అని చెపుతున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు తమకు నచ్చిన కంపెనీలకు కొంత మేర ఫేవర్ చేయటం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ సారి అది బరితెగింపు స్టేజ్ కు వెళ్ళింది అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే చింతా గ్రీన్ ఎనర్జీ , నవయుగా సంస్థలకు గత ఐదు నెలల కాలంలోనే వేల మెగావాట్ల సామర్ధ్యంతో కూడిన ప్రాజెక్టులు కేటాయించారు. ఇదే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే దీని వెనక రెండు ప్రముఖ మీడియా సంస్థల యాజమాన్యాలు కూడా తెరవెనక ఉండి కథ నడిపిస్తున్నాయి అనే చర్చ కూడా అధికార వర్గాల్లో ఉంది. చింతా గ్రీన్ ఎనర్జీ ఢిల్లీ లో నమోదు అయిన కంపెనీ.

ఇందులో డైరెక్టర్లుగా నవయుగా గ్రూప్ అధినేత చింతా విశ్వేశర రావు, గౌరీనాథ్ అట్లూరి ఉన్నారు. ఈ సంస్థకు ఈ ఏడాది ఏప్రిల్ లోనే రెండు చోట్ల అంటే తిరుపతిలో 2450 కోట్ల రూపాయల పెట్టుబడితో , శ్రీ సత్యసాయి జిల్లా లో ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది అని చెప్పి ఎస్ఐ పీబి లో పవర్ ప్రాజెక్ట్ లకు ఆమోదం తెలిపింది. అప్పటికి కంపెనీ నమోదు అయి కేవలం రెండు నెలలు మాత్రం. ఇప్పుడు మరో సారి అంటే గురువారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు అద్యక్షతన జరిగిన ఎస్ఐపీబి మీటింగ్ లో ఇదే చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కు కడప జిల్లాలోని కొప్పోలు దగ్గర 2323 కోట్ల రూపాయల పెట్టుబడితో 360 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే నవయుగా గ్రూప్ కు చెందిన కంపెనీలకు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గుజ్జిలి వద్ద 1500 మెగావాట్లు, చిట్టంవలస దగ్గర 800 మెగావాట్ల ప్రాజెక్ట్ లకు అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం కొద్ది నెలల క్రితం ఉత్తర్వులు జారీచేసింది.

ఇటీవల జరిగిన ఎస్ఐపీబి సమావేశంలో పలు అదానీ విద్యుత్ ప్రాజెక్ట్ ల సామర్థ్యం పెంపునకు కూడా అనుమతి మంజూరు చేశారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో అదానీ గ్రూప్ చేతిలో కృష్ణపట్నం పోర్ట్ తో పాటు గంగవరం పోర్ట్ కూడా ఉన్న విషయం తెలిసిందే . ఇవే కాకుండా ఇప్పుడు భారీ విద్యుత్ ప్రాజెక్టులు..డేటా సెంటర్లు కూడా కంపెనీ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది. ఇలా ఎంపిక చేసిన కొన్ని కంపెనీల కే వేలకు వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులతో పాటు పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ఇవ్వటం ద్వారా అధికారంలో ఉన్న వాళ్ళు పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.

గత కొంత కాలంగా పవర్ ప్రాజెక్ట్ లు కేటాయింపు అంతా ఒక పధకం ప్రకారం జరుగుతోంది అని విద్యుత్ శాఖ వర్గాలు కూడా చెపుతున్నాయి. నవయుగా ప్రమోటర్లతో మొదటి నుంచి చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని అధికారులు చెపుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు చేస్తున్న సమయంలో ఈ కంపెనీ ప్రతినిధులు ఎన్నికల ముందు చేసిన పనులు కొన్ని కూడా తీవ్ర దుమారం రేపినట్లు అధికారులు చెపుతారు. రాబోయే రోజుల్లో ఈ విద్యుత్ ప్రోజెక్టుల కేటాయింపు వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే. తెర వెనక ఉండి ఈ వ్యవహారాలు చూస్తున్న ఒక కీలక మంత్రి టీం కొత్తగా అనుమతి ఇచ్చే విద్యుత్ ప్రాజెక్ట్ లకు సంబదించిన మెగావాట్ కు ఇంత అని చెప్పి వసూళ్లు చేస్తున్నట్లు అధికారులు చెపుతున్నారు. మరి కొన్ని చోట్ల కొంత మందితో కలిసి వివిధ మార్గాల్లో సంపాదించినా మొత్తాలను కూడా ఇందులో పెట్టుబడిగా కుడి పెడుతున్నట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి.

Next Story
Share it