వివాదరహితుడు..మేకపాటి గౌతంరెడ్డి
ఏపీ పరిశ్రమల శాఖ మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరినీ షాక్ కు గురిచేసింది. పార్టీలతో సంబంధం లేకుండా నేతలు అందరూ ఆయన మరణవార్త విని ద్రిగ్భాంతికి గురయ్యారు. ఎప్పుడూ వివాదాల జోలికిపోకుండా తన పని ఏదో తాను చేసుకోవటం ఆయన నైజం. అందుకే ఆయన మరణవార్త తెలిసిన వెంటనే అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏ అంశంపై అయినా మనసులో ఒకటి పెట్టుకుని మాట్లాడటం కాకుండా తన వైఖరిని నిర్మోహమాటంగా వెల్లడించేవారు. యూనివర్శిటీ ఆఫ్ మాంచెస్టర్ లో ఆయన విద్యాభ్యాసం చేశారు. రెండుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. చనిపోవడానికి ఒక్క రోజు ముందు వరకు మేకపాటి గౌతంరెడ్డి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొన్నారు.
2022 ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 17వ తేదీ దుబాయ్ ఎక్స్‌పోలో నిర్వహించిన ఏపీ పెవిలియన్‌ను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో వారం రోజుల పాటు అలుపెరగకుండా చర్చలు జరిపారు. అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్ రోడ్‌షోలో ఆయన స్వయంగా పాల్గొని ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. మంత్రి గౌతంరెడ్డి ఆకస్మికంగా మరణంతో ఏపీ ప్రభుత్వం అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసి..రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోపాటు ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విషాదంలో మునిగిపోయారు. సీఎం జగన్ మంత్రి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు తాడేపల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయడు హైదరాబాద్ లో గౌతంరెడ్డికి నివాళులు అర్పించారు.