బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడితో టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి భేటీ అయ్యారు. కొద్ది రోజుల క్రితం ఆయన చంద్రబాబు, నారా లోకేష్ ల తీరును తప్పుపట్టారు. సీనియర్ నేత అయిన తన ఫోన్లకు కూడా వీరు అందుబాటులోకి రావటంలేదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. పార్టీ నేతలతో చర్చల అనంతరం బుచ్చయ్య చౌదరి గురువారం నాడు అమరావతిలో చంద్రబాబుతో సమావేశం అయ్యారు. సుదీర్ఘ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ తీరులో మార్పు రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తన అభిప్రాయాలను అధినేత చంద్రబాబునాయడుకి స్పష్టంగా చెప్పానన్నారు. తొలుత రాజీనామా చేయాలనుకున్న మాట వాస్తవమేనని..అయితే అందరి సూచనల మేరకు ఇప్పుడు ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గుతున్నట్లు తెలిపారు. తాను పదవుల కోసమే లేక మరో డిమాండ్ తీర్చుకోవటం కోసం ఈ మాటలు మాట్లాడలేదన్నారు.
పార్టీ దెబ్బతినటాననికి గల కారణాలను కూడా చెప్పానన్నారు. కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఒక సామాజిక వర్గంలో ఒక నాయకుడినే నమ్ముకోవటం సరికాదన్నారు. చాలా మంది నాయకులు ఉన్నారని..ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తాను రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని పరిస్థితుల గురించి మాట్లాడానన్నారు. పార్టీలో మార్పులు చేయాలని అధినేత సూచించినట్లు తెలిపారు. సామాజికపరంగా కూడా మార్పులు అవసరం అన్నారు. ఫోటోలతో పనికాదని..అందరిని కలుపుకుని పోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఏ మాత్రం డెవలప్ మెంట్ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.