Telugu Gateway
Andhra Pradesh

రాయితీలు ఒకరికి...భూములన్నీ మరొకరికా?!

రాయితీలు ఒకరికి...భూములన్నీ మరొకరికా?!
X

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం వైజాగ్ లో లక్ష కోట్ల రూపాయల గూగుల్ డేటా సెంటర్ అంటూ హడావుడి చేసింది. ఈ ప్రాజెక్ట్ తో వైజాగ్ రూపు రేఖలు మారటంతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ చిత్రమే మారిపోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇందులో తప్పేమి లేదు. కానీ ప్రభుత్వం రాయితీలు ఇస్తూ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేర జీవో ఇచ్చింది. కానీ ఈ సంస్థకు రాయితీలు ఇచ్చి డేటా సెంటర్ల భూమి మొత్తాన్ని కూడా అదానీ గ్రూప్ కంపెనీ కి మాత్రమే ఎందుకు బదిలీ చేస్తున్నట్లు అన్నది ఇప్పుడు చర్చనీయాంశగా మారింది. రైడెన్ నేరుగా భూమి తీసుకోవటానికి ఎందుకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. రాయితీలు అన్ని కూడా ఇదే కంపెనీ పేరుతో ఇచ్చినప్పుడు భూమి నేరుగా ఈ కంపెనీ కి కాకుండా అదానీ ఇన్ ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించాల్సిన అవసరం ఎందుకొచ్చింది.

ఈ ప్రాజెక్ట్ అమలు కోసం ఎవరు ఎవరితో ఒప్పందాలు చేసుకున్నా కూడా నేరుగా రాయితీలు ఇచ్చిన ..డీపీఆర్ ఇచ్చిన సంస్థకు కాకుండా మరొకరి పేరు మీద భూమి ఇవ్వటం పై ఇప్పుడు పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. వైజాగ్ లో లక్ష కోట్ల రూపాయల పైగా పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ల ప్రాజెక్ట్ కు సంబదించిన భూమి అంతా కూడా అదానీ ఇన్ ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కే కేటాయించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం వైజాగ్ తో పాటు అనకాపల్లి జిల్లాల్లో మొత్తం మూడు చోట్ల 480 ఎకరాలను గుర్తించిన విషయం తెలిసిందే. ఈ మొత్తం అంటే 480 ఎకరాలను కూడా అదానీ ఇన్ ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు బదిలీ చేస్తూ ఐటి శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇందులోనే రైడెన్ తమ భాగస్వామ్య సంస్థలుగా అదానీ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ కనెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ , అదానీ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లతో పాటు భారతి ఎయిర్ టెల్ లిమిటెడ్ అనుబంధ సంస్థ లు అయిన ఎన్ ఎక్స్ట్రా డేటా లిమిటెడ్ , ఎన్ ఎక్స్ట్రా వైజాగ్ లిమిటెడ్ లు తమ నోటీఫైడ్ భాగస్వాములుగా పేర్కొన్నట్లు ఈ జీవో లో ప్రస్తావించారు. వైజాగ్ లో ఈ సంస్థలు అన్ని కలిపి 1000 మెగావాట్ల పైన సామర్ధ్యంతో కూడిన డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి 2025 సెప్టెంబర్ 11 న జారీ చేసిన జీవో ప్రకారం చూస్తే రైడెన్ 87,520 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది అని పేర్కొన్నారు..ఇందుకు గాను ప్రభుత్వం అన్ని కలుపుకుని 22022 కోట్ల మేర రాయితీలు ఇవ్వటానికి అంగీకరించారు. ఇదే గరిష్ట మొత్తం అని ఎస్ఐపీబి సమావేశంలో నిర్ణయించారు.

అయితే రైడెన్ నోటీఫైడ్ భాగస్వాములు పెట్టుబడి పెట్టి రాయితీలు పొందాల్సి ఉంటుంది అని తొలుత ఇచ్చిన జీవో 40 లో వెల్లడించారు. ఈ పెట్టుబడి ద్వారా పెద్దఎత్తున పరోక్ష ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు కానీ..నిర్దిష్టంగా ఇందులో ఎలాంటి ఉద్యోగుల సంఖ్యను ఇందులో ప్రస్తావించలేదు. రైడెన్ దాని అనుబంధ సంస్థలు అయిన గూగుల్, గూగుల్ క్లౌడ్ ఈ ప్రాజెక్ట్ కు కట్టుబడి ఉన్నాయని ఇందులో పేర్కొన్నారు. గూగుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాణ్యతతో గ్లోబల్ డేటా సెంటర్ ప్రమాణాలు ఇందులో ఉంటాయన్నారు. 2025 ఆగస్ట్ 22 న ఇచ్చిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) ప్రకారం ప్రాజెక్ట్ ను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే ఒక వైపు జీవో లో మొత్తం 480 ఎకరాలు అదానీ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించగా...అదే జీఓలో రైడెన్ రాంబిల్లి భూమిని అంటే 160 ఎకరాలను ఎన్ ఎక్స్ట్రా డేటా కు కేటాయించనున్నట్లు తెలిపారు. మిగిలిన రెండు సైట్స్ మాత్రం అదానీ కంపెనీ చేతికి వెళతాయి అన్నారు.

Next Story
Share it