Telugu Gateway
Andhra Pradesh

వైసీపీ బ్రాండ్ అంబాసడర్ గా జీఎంఆర్ !

వైసీపీ బ్రాండ్ అంబాసడర్ గా జీఎంఆర్ !
X

వచ్చే ఏడాది జరిగే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి ఎవరు గెలిచేది జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జున రావు డిసైడ్ చేస్తారా?. బుధవారం నాడు ఆంధ్ర ప్రదేశ్ లోని భోగాపురం విమానాశ్రయం శంఖుస్థాపనలో అయన మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద సంచలనంగా మారాయి. ఇవి ఇప్పుడు రాజకీయ, అధికార వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ విమానాశ్రయానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు శంకుస్థాపన చేశారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ప్రాజెక్ట్ మూడేళ్ళలో పూర్తి కావాలి. అంటే ఇది 2026 లో పూర్తి అవుతుంది. భోగాపురం విమానాశ్రయ శంఖుస్థాపన కార్యక్రంలో పాల్గొన్న మల్లికార్జున రావు చేసిన కామెంట్స్ ఇలా ఉన్నాయి. ‘నా ఫస్ట్ ఎయిర్ పోర్ట్ శంషాబాద్ సీఎం గా ఉండి రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎం గా ఉండి ప్రారంభించారు. ఢిల్లీ విమానాశ్రయం ప్రారంభోత్సవం లో కూడా అయన పాల్గొన్నారు. ఈ రోజు అది భగవంతుడి నిర్ణయమో ఏమో తెలియదు వారి తనయుడు జగన్ మోహన్ రెడ్డి భోగాపురం విమానాశ్రయం ఫౌండేషన్ వేయటం అన్నది ఎంతో సంతోషం, వారే మళ్ళీ దీన్ని ఇనాగరేట్ చేయాలనీ నేను భగవంతుడిని కోరుకుంటున్నా’ అంటూ మళ్ళీ కార్జున రావు వ్యాఖ్యానించారు. అంటే వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ మళ్ళీ గెలిచి సీఎం గా దీన్ని ప్రారంభించాలని కోరారని...రాజకీయ అంశాలపై ఒక పారిశ్రామిక వేత్త ఇలా పబ్లిక్ మీటింగ్ లో ఎలా మాట్లాడతారు అంటూ ఒక ఐఏఎస్ అధికారి విస్మయం వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్ ను గెలిపించాలా..లేక ప్రత్యామ్నాయం చూడాలా అన్నది నిర్ణయించేది అక్కడి ప్రజలే. కానీ జగన్ మళ్ళీ ప్రారంభించాలి అంటూ జీఎంఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. వాస్తవానికి ఈ విమానాశ్రయానికి టెండర్ ఫైనలైజ్ అయింది గత ప్రభుత్వంలో ..చంద్రబాబు నాయుడు సీఎం గా ఉండగా జరిగింది. ఇది పెద్ద స్కాం అని వైసీపీ నేతలు అప్పటిలో పెద్ద ఎత్తున విమర్శించారు...ఇంకా ప్రభుత్వంలో కొనసాగుతున్న సలహాదారు అజయ్ కల్లమ్ కూడా దీన్ని తీవ్రంగా తప్పు పట్టారు. సీఎం ఫ్యామిలీ పఃత్రిక సాక్షిలో అయితే దీనిపై ఎన్ని కథనాలు వచ్చాయో లెక్కే లేదు. కేవలం తనకు కావాల్సిన జీఎంఆర్ కు మేలు చేసేందుకే చంద్రబాబు ఏఏఐ ను కాదని జీఎంఆర్ ను తెరపైకి తెచ్చారని వైసీపీ నేతలు విమర్శించారు. తర్వాత టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చాక విమానాశ్రయానికి ఇచ్చిన భూమిలో ఒక 500 వందల ఎకరాలు తగ్గించారు తప్ప....ఒప్పందంలో అతి కీలకమైన, ఆర్థిక శాఖ లేవనెత్తిన అభ్యంతరాలను ఏ మాత్రం పట్టించుకోలేదు. దీనిపై ప్రయాణికులపై పెద్ద ఎత్తున భారం పడబోతోంది. టెండర్ జీఎంఆర్ కు ఇవ్వటాన్ని తప్పుపట్టిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్నే ఓకే చేయటం ఒకెత్తు అయితే...జీఎంఆర్ చేతిలో ఉన్న కాకినాడ సెజ్ భూములను కూడా జగన్ సాన్నిహిత్యం ఉన్న అరబిందో కంపెనీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తొలుత భోగాపురం ఒప్పందం ఖరారు విషయంలో జాప్యం చేయటం, కాకినాడ సెజ్ భూములు డీల్ తర్వాత అంతే సెట్ అయింది అని ప్రచారంలో ఉంది.





Next Story
Share it