పెరుగుతున్న క్విడ్ ప్రో కో ఆరోపణలు!

అక్రమంగా వచ్చిపడుతున్న వందల కోట్ల రూపాయలు. ఆంధ్ర ప్రదేశ్ లోని రెండు కీలక పార్టీల్లో అగ్ర నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలు. అందుకే తాను చెప్పిందే నడవాలంటున్నారు....తాము చెప్పిన వారికే కాంట్రాక్టు దక్కాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. పైగా ఈ టెండర్ కోసం ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గంలో ఒక కీలక మంత్రి కూడా రంగంలోకి దిగటంతో ఈ పవర్ బ్రోకర్ బెదిరింపులకు అడ్డులేకుండా పోయింది అని విద్యుత్ శాఖ వర్గాలు చెపుతున్నాయి. ఏ టెండర్ విషయంలో అయినా సరే కాంట్రాక్టర్ల కోరిక మేరకు ఒకటి రెండు సార్లు గడువు పొడిగిస్తారు. కానీ ఏపీ జెన్ కో అనంతపురం జిల్లా యాడికిలో నిర్మించనున్న పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు టెండర్ గడువును ఏకంగా నాలుగు సార్లు పొడిగించినట్లు ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి. ఇది అంతా కూడా టెండర్ కేవలం తాము అనుకున్న కంపెనీకి దక్కేలా చేసుకోవటం కోసమే ఆయన ఈ తతంగం అంతా నడిపిస్తున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి.
ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే దేశంతో పాటు రాష్ట్రంలో కూడా హవా చెలాయిస్తున్న ఒక కంపెనీ ని పక్కకు తప్పించి మరీ ఈ పవర్ బ్రోకర్ లింగా అండ్ టీం ఈ ఐదు వేల కోట్ల రూపాయల టెండర్ ను దక్కించుకునేందుకు ఈ స్కెచ్ వేసింది. ఇందుకు ఒక బినామీ కంపెనీని రంగంలోకి దింపినట్లు ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మొత్తం వ్యవహారంలో సంబంధింత శాఖ మంత్రి టీంలోని వాళ్ళు కూడా తమ వంతు సాయం అందిస్తున్నట్లు చెపుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ శాఖలో పవర్ ఫుల్ ఐఏఎస్ గా ఉన్న అధికారి కూడా ప్రభుత్వ పెద్దలు...వాళ్లకు కావాల్సిన వాళ్లకు ఏది కావాలంటే అది చేసిపెడుతూ అధికారంలో ఎవరు ఉన్న వాళ్ళ గుడ్ లుక్స్ లో ఉంటున్నారు. అందుకే ఆయన హవా విద్యుత్ శాఖలో అలా సాగిపోతుంది అని ఆ శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వాలు మారుతున్నా కూడా క్విడ్ ప్రో కో విధానం మాత్రం కొత్త కొత్త పుంతలు తొక్కుతోంది అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థ జెన్ కో చేపట్టే ఈ ప్రాజెక్ట్ ను ఎంత త్వరగా వీలు అయితే అంత త్వరగా పనులు అప్పగించి ప్రాజెక్ట్ పూర్తి అయ్యేలా చూడాలి. కానీ కొంత మంది ఉన్నతాధికారులు తమకు నచ్చిన వాళ్లకు కాంట్రాక్టు దక్కేలా చూడటం కోసం తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ టెండర్ ఖరారులో విపరీతమైన జాప్యానికి కారణం అవుతున్నారు. మరో వైపు యాడికిలో నిర్మించనున్న ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఏకంగా 20 శాతం మేర పెంచినట్లు విద్యుత్ శాఖ వర్గాలు చెపుతున్నాయి. ప్రభుత్వంలో కొంత మంది మంత్రులు...ఐఏఎస్ అధికారులు రాష్ట్రం కోసం పనిచేస్తున్నారో...లేక ప్రైవేట్ కంపెనీలు...కాంట్రాక్టర్ల కోసం పని చేస్తున్నారో అర్ధం కాకుండా పోతోంది అనే విమర్శలు విన్పిస్తున్నాయి.



