Telugu Gateway
Andhra Pradesh

రాజీనామా ఆమోదం కోసం గంటా లేఖ‌

రాజీనామా ఆమోదం కోసం గంటా లేఖ‌
X

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు మ‌రోసారి త‌న రాజీనామా అంశాన్ని తెర‌పైకి తెచ్చారు. తాజాగా ఆయ‌న ఏపీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారామ్ కు లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 12న తన శాసన సభ్యత్వానికి గంటా రాజీనామా చేశారు. అప్ప‌టి నుంచి మౌనంగా ఉంటూ వ‌స్తున్నారు. ఓ వైపు వైజాగ్ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ ప‌నులు శ‌ర‌వేగంగా ముందుకు సాగుతున్నాయి. మ‌ధ్య‌లో గంటా కూడా రాజీనామా అంశంపై పెద్ద‌గా స్పందించింది లేదు. ఇప్పుడు త‌న లేఖ‌లో ఏడాది దాటినా తన రాజీనామాను ఆమోదించకపోవడంపై ఆవేదన చెందుతున్నట్లు పేర్కొన్నారు.

ఏడాదికాలంగా పోరాడుతున్న నిర్వాసితుల, కార్మికుల పోరాటాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధను కలిగించిందన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని గంటా ప్రకటించారు. గ‌తంలో ఇదే అంశంపై తెలంగాణ అసెంబ్లీకి వ‌చ్చి మంత్రి కెటీఆర్ తో స‌మావేశం అయ్యారు. అప్ప‌ట్లో కెటీఆర్ ను విశాఖ ప‌ట్నం తీసుకెళ్లి కార్మికుల‌కు సంఘీభావంగా స‌మావేశం నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ అది కార్యాచర‌ణ‌కు నోచుకోలేదు.

Next Story
Share it