పదవి పోయినా...జీ వి రెడ్డి ఇమేజ్ పెరిగింది!
కూటమి సర్కారుకు ..ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు బిగ్ షాక్. చాలా మంది చైర్మన్ పోస్ట్....లేదా మరో పదవి దక్కించుకోవటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అలాంటిది ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పోస్ట్ దక్కించుకున్న జీ వీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. చైర్మన్ పోస్ట్ తో పాటు టీడీపీ కి కూడా గుడ్ బై చెప్పారు. గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఈ సంస్థలో అక్రమంగా నియమించిన వాళ్ళను తొలగించాలని...సంస్థ పని తీరు మెరుగుపర్చేందుకు తాను పలు నిర్ణయాలు తీసుకుంటే వాటిని ఎండీ దినేష్ కుమార్ అమలు చేయకపోగా.. ఏ మాత్రం సహకరించటం లేదు అని..ఆయన చర్యలు రాజద్రోహం కింద వస్తాయి అంటూ జీ వి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి పెద్ద దుమారం రేపాయి.
ఐఏఎస్ అధికారులు వీటిపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో ...చంద్రబాబు తో పాటు మంత్రి బీ సి జనార్దన్ రెడ్డి చైర్మన్ నుంచి వివరణ కోరారు. జీ వీ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తూ పార్టీ వాయిస్ ను గట్టిగా వినిపించిన సంగతి తెలిసిందే. పదవి దక్కించుకున్న కొద్ది నెలలకే ఆయన తన పోస్ట్ తో పాటు టీడీపీ కి కూడా రాజీనామా చేయటం రాజకీయంగా టీడీపీ కి షాక్ లాంటిదే అని చెప్పొచ్చు. చంద్రబాబు ఎప్పుడూ అధికారుల పక్కన ఉంటారు కానీ...నిక్కచ్చిగా పని చేసే పార్టీ నాయకుల వైపు ఉండరు అనే విషయం తాజా పరిణామాలతో ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉంది అనే అభిప్రాయం టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్ పదవితో పాటు టీడీపీ కి గుడ్ బై చెప్పిన ఆయన భవిష్యత్ లో పూర్తి గా న్యాయవాద వృత్తిలో కొనసాగనున్నట్లు తెలిపారు. ఇంత తక్కువ వ్యవధిలో ఒక కీలక చైర్మన్ పదవి వదులుకోవడం అన్నది కీలక పరిణామంగానే చెప్పుకోవాలి. జీ వి రెడ్డి నిర్ణయంతో ఆయన పదవి పోయినా... ఇమేజ్ పెరిగింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.