Telugu Gateway
Andhra Pradesh

ఈ పని మరి అప్పుడే ఎందుకు చేయలేదు?!

ఈ పని మరి అప్పుడే ఎందుకు చేయలేదు?!
X

ఆంధ్ర ప్రదేశ్ రాజధానికి సంబంధించి వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో కొత్త ప్రతిపాదన తెరమీదకు తెచ్చారు. ఫస్ట్ అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతికి ఒప్పుకున్న ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల నినాదం అందుకున్న విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతికి విభజన చట్టం సవరణ ద్వారా పార్లమెంట్ లో చట్టబద్దత కల్పించే దిశగా ప్రయత్నం చేస్తున్న వేళ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడారు. బుధవారం నాడే లోక్ సభలో విభజన చట్టానికి చేసిన సవరణకు ఆమోదం కూడా పొందింది. గురువారం నాడు రాజ్య సభ లోకూడా ఈ ప్రక్రియ పూర్తి కానుంది. అయినా కూడా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ నేతలు అంతా కూడా అమరావతి విషయంలో ప్రజల్లో అనిశ్చితి కొనసాగించటమే లక్ష్యంగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. జగన్ కూడా అమరావతి స్థానంలో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నంను కలిపి మావిగన్ పేరుతో కాపిటల్ కారిడార్ గా ప్రకటించాలి అన్నారు.

మావిగన్ లో తన పేరు వచ్చేలా ఉంది అని భావిస్తే కొత్త పేరు పెట్టాలన్నారు. ఇది మొత్తం 110 కిలోమీటర్ల కారిడార్ అవుతుంది అన్నారు. నిజంగా జగన్ కు అమరావతి ప్లేస్ లో రాజధానిగా ఇలా చేయాలనే ప్రతిపాదన ఉండి ఉండే తాను అధికారంలో ఉన్నప్పుడే మూడు రాజధానుల బదులు ఈ పని ఎందుకు చేయలేదు అన్న ప్రశ్న తలెత్తెడం సహజం. అయితే జగన్ నేరుగా అమరావతిని అంగీకరించటం ఇష్టం లేక...ఇప్పుడు ఈ కొత్త మోడల్ ను తెరమీదకు తెచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది అనే చెప్పొచ్చు. లోక్ సభ లో కూడా వైసీపీ అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లును ఈ రూపంలో తాము అంగీకరించం అని చెప్పి వాక్ అవుట్ చేసింది. రైతులకు ఇందులో రక్షణ కల్పించాలి...రాజధానికి అవసరం అయ్యే ఖర్చును ఎలా సమీకరిస్తారో చెప్పాలి అంటూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్ సభలో మాట్లాడుతూ డిమాండ్ చేశారు.

ఎవరు ఎన్ని చెప్పిన పార్లమెంట్ లో ఒక సారి అమరావతికి చట్టబద్దత వస్తే ...మళ్ళీ పార్లమెంట్ లో చట్టసవరణ చేయటం ద్వారానే ఎవరైనా రాజధానిని అమరావతి నుంచి మార్చటానికి ఛాన్స్ ఉంటుంది. అంతే తప్ప గతంలో జగన్ మోహన్ రెడ్డి సడన్ గా అసెంబ్లీ మూడు రాజధానుల ప్రకటన చేసిన చందంగా చేసి గందరగోళం చేయటానికి ఛాన్స్ ఉండదు అని అధికార వర్గాలు చెపుతున్న మాట. రాజధానిని భవిష్యత్ లో ఎవరూ మార్పులు చేయకుండా చట్టం చేస్తున్నాం అని చెపుతున్నారు...అసెంబ్లీ లో వీళ్ళు చేయగలిగింది..మళ్ళీ అదే అసెంబ్లీ వేరే వాళ్ళు చేయలేరా అంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ లో వ్యాఖ్యానించారు అంటే ఆయన అసలు ఎజెండా ఏంటో స్పష్టంగా కనిపిస్తోంది.

Next Story
Share it