Telugu Gateway
Andhra Pradesh

ఫైవ్ స్టార్ లగ్జరీ రిసార్ట్ కోసం

ఫైవ్ స్టార్ లగ్జరీ రిసార్ట్ కోసం
X

అదేమీ విచిత్రమో కానీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయిన తర్వాతే కొత్త కొత్త కంపెనీలు అలా పుట్టుకొస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లు దక్కించుకుంటున్నాయి. ఉదాహరణకు చింతా గ్రీన్ ఎనర్జీ. అలా ఇన్ కార్పొరేట్ చేయటం..ఇలా వచ్చి ఆంధ్ర ప్రదేశ్ వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లు దక్కించుకోవటం. ఈ ప్రమోటర్లకు వివిధ రకాల వ్యాపారాలు ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఏపీ లో ఈ కేటాయింపుల తీరు చూసి ఐఏఎస్ అధికారులు కూడా అవాక్కు అయ్యే పరిస్థితి. వైజాగ్ లో వందల కోట్ల రూపాయల విలువైన భూములు దక్కించుకునేందుకు ఉర్సా క్లస్టర్స్ కంపెనీ కూడా అలాగే అప్పటికప్పుడు పుట్టుకొచ్చింది. దీనిపై వివాదం తలెత్తడంతో అసలు ఇప్పుడు ఆ కంపెనీ పేరు వినిపించటం లేదు ఎక్కడా. ఇప్పుడు అలాంటిదే మరో కంపెనీ కథ తెర మీదకు వచ్చింది. ఈ కంపెనీ కూడా ఇటీవల పుట్టుకొచ్చిందే . అదే మెగ్ లాన్ లీజర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎల్ ఎల్ పీ. ఈ కంపెనీ ని ఇన్ కార్పొరేట్ చేసింది 2025 ఫిబ్రవరిలోనే. ఇంకో విచిత్రం ఏమిటి అంటే ఫిబ్రవరిలో పుట్టిన ఈ కంపెనీ మే లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టింది. అంతే వెంటనే జూన్ 19 న ముఖ్యమంత్రి చంద్రబాబు అద్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఓకే చేశారు.

అన్నిటి కంటే షాకింగ్ విషయం ఏమిటి అంటే ఈ కంపెనీ డైరెక్టర్ వైసీపీ మాజీ ఎంపీకి అత్యంత సన్నిహితుడు. ఈ పవర్ ఫుల్ ఎక్స్ ఎంపీకి అన్ని పార్టీలతోనూ లింక్ లు ఉన్నాయి. ఒకప్పుడు ఆ నాయకుడు భీమిలి బీచ్ రోడ్ లో ఉండే ఈ ప్రమోటర్ కు చెందిన తిమ్మాపురం ఫార్మ్ హౌస్ లోనే కాలం గడిపేవాడు. అంతే కాదు అత్యంత వివాదాస్పదం అయిన దసపల్లా ల్యాండ్ డెవలప్ మెంట్ అగ్రిమెంట్ లో కూడా ఇప్పుడు కొత్తగా ఏపీ లో ప్రాజెక్ట్ దక్కించుకున్న డైరెక్టర్ ఒకరు భాగస్వామి అయినట్లు టీడీపీ వర్గాలే చెపుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం మారటంతో ఒప్పందాలు అన్నీ కూడా అటు ఇటు అవుతున్న తరుణంలో ఇప్పుడు ఈ భూ కేటాయింపు అంధ ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కంపెనీ డైరెక్టర్లు గా ప్రస్తుతం ఉమేష్ కూనపరెడ్డి, లక్ష్మి కూనపురెడ్డి ఉన్నారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పక్కనే 5 స్టార్ లగ్జరీ రిసార్ట్ ఏర్పాటు కోసం ఈ సంస్థకు 15 .25 ఎకరాలు ఇవ్వటానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

తొలుత 66 సంవత్సరాలు లీజ్ కు ఇస్తారు...తర్వాత దీన్ని మరో 33 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. ఈ భూమికి కంపెనీ సబ్ రిజిస్టార్ వేల్యూ లో ఒక శాతం, స్థూల ఆదాయంలో ఒక శాతం అదనపు డెవలప్ మెంట్ ప్రీమియం చెల్లించాలి అనే నిబంధన విధించారు. ఈ కంపెనీ 255 కోట్ల రూపాయల పెట్టుబడితో 350 మందికి ఉపాధి కలిపించనుంది అని వెల్లడించారు. పర్యాటక విధానం కింద వంద శాతం ఎస్జీఎస్టీ మినయింపులతో పాటు ఇతర అన్ని రాయితీలు కల్పించనున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం జగన్ హయాంలో హవా చెలాయించిన కంపెనీలతో కలిసి సాగుతోంది అని విమర్శలు ఎదుర్కొంటున్న వేళ ఇప్పుడు వైసీపీ మాజీ ఎంపీకి చెందిన అత్యంత సన్నిహితుడిగా పేరున్న వ్యక్తి కంపెనీకి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ దగ్గర ఈ భూమి కేటాయించటం హాట్ టాపిక్ గా మారింది.

Next Story
Share it