జీతాల కోసం ప్రతి నెలా ఫైట్ చేసేది ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే

జగన్ స్కీములు ఆగవు..ఉద్యోగుల జీతాలే ఆగుతాయి
ఏంటో ఈ మాయ. ఉద్యోగులకు సీఎం జగన్ జీతాలు ఇవ్వాలంటే..అదీ పథకంగా మారాలేమో .ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని ఉద్యోగుల అభిప్రాయం. ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన నవరత్నాలు మాత్రం ఎప్పుడూ ఆగటం లేదు..ఎక్కడా ఆగటం లేదు. కొన్ని స్కీముల్లో కోతలు ఉన్నాయనే వార్తలు వచ్చినా అయన నవరత్నాలు మాత్రం డోకా లేకుండా సాగుతున్నాయి.అప్పులు చేసి అయినా సరే...తిప్పలు పడి అయినా సరే ప్రస్తుతానికి కొనసాగిస్తున్నారు. కానీ పనిచేసిన లక్షలాది మంది ఉద్యోగులకు మాత్రం జీతాలు ఎప్పుడూ సకాలంలో రావటం లేదు. బహుశా దేశం లో జీతాల కోసం ఇలా ప్రతి నెలా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లో తప్ప మరెక్కడా లేదేమో. ఒక్కసారి అంటే ఎవరైనా సర్దుబాటు చేసుకుంటారు. కానీ ప్రతి నెలా ఇదే పరిస్థితి అంటే మాత్రం ఎవరికైనా దారుణమే. చేసిన పనికి సకాలంలో వేతనాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అలాంటిది ప్రభుత్వమే గత కొంతకాలంగా జీతాలు విడతల వారీగా చెల్లిస్తుండటంతోఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది.
ఉద్యోగులు సహజంగా తమకు ప్రతినెలా ఒకటవ తేదీన జీతాలు వస్తాయనే ఉద్దేశం తో బ్యాంకు లోన్ లు...ఇతర అప్పులకు ప్రతి నెల మొదటివారం డేట్ ఫిక్స్ చేసుకుంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఈ తరహా పరిస్థితి ఊహించి ఉండరు. అందుకే ఇప్పుడు ఉద్యోగులు విలవిలలాడుతున్నారు. ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంటే ఇక పెన్షనర్ల తీరు వర్ణనాతీతం. విచిత్రం ఏమిటి అంటే కొంత మంది మంత్రులు ఉద్యోగుల జీతాలు తమ ప్రాధాన్యత కాదు అని...కొద్దిగా లేట్ అయితే ఏమి అవుతుంది అంటూ కామెంట్స్ చేయటం మరీ దారుణం. వాళ్ళు మాత్రం టైం కు జీతాలు తీసుకుంటున్నారు. మంత్రులు...సలహాదారులు మాత్రం ప్రతి నెల ఫస్ట్ నే జీతాలు పడతాయి. ఇప్పుడు చాలా వరకు ఐఏఎస్ లు కూడా ఉద్యోగుల జాబితాలో చేరినట్లు చెపుతున్నారు.. వాళ్లకూ విడతలవారీగానే జీతాలు అందుతున్నాయి. అయితే ప్రస్తుత జీతాల గడ్డు పరిస్థితి ఫిబ్రవరి, మార్చి లోనూ కొనసాగే అవకాశం ఉంది అని చెపుతున్నారు. జీతాల పరిస్థితి ఇలా ఉంటే ఇక ఉద్యోగుల ఇతర ప్రయోజనాల సంగతి గురించి అయితే ఇక మాట్లాడే పరిస్థితి లేదు.