Telugu Gateway
Andhra Pradesh

సీఎం టూర్ కోసం కారు లాక్కున్నారు

సీఎం టూర్ కోసం కారు లాక్కున్నారు
X

విన‌టానికి విచిత్రంగా ఉన్నా ఈ వింత సంఘ‌ట‌న జ‌రిగింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం నాడు ఒంగోలు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా పోలీసు అధికారులు అన్ని ర‌కాల ఏర్పాట్లు చేస్తున్నారు. అదే స‌మ‌యంలో తిరుప‌తి వెళుతూ రాత్రి వేళ భోజ‌నం కోసం ఓ హోట‌ల్ దగ్గ‌ర ఆగిన కుటుంబానికి చేదు అనుభ‌వం ఎదురైంది. సీఎం టూర్ కాన్వాయ్ కోసం కారు కావాలంటూ వీరి కారును, డ్రైవ‌ర్ ను బ‌ల‌వంతంగా తీసుకెళ్ళారు. దీంతో నిర్ఘాంత‌పోవ‌టం ఆ కుటుంబం వంతు అయింది. చివ‌ర‌కు వారు రాత్రంతా బ‌స్టాండులోనే కాలం గ‌డిపి..మ‌రో వాహ‌నం వెతుక్కుని తిరుప‌తి బ‌య‌లుదేరి వెళ్ళారు. ఈ విష‌యం కాస్తా మీడియాలో రావ‌టంతో పెద్ద దుమార‌మే రేగింది. ఈ దారుణ ఘ‌ట‌న‌పై తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు స్పందించారు. సీఎం కాన్వాయ్ కోసం ఆర్ టీఏ అధికారులు ఒంగోలులో ప్రజల కార్ లాక్కెళ్ళడం రాష్ట్రం లో దౌర్భాగ్యపు పాలనకు నిదర్శనం అని మండిప‌డ్డారు.

కుటుంబంతో తిరుమల దర్శనానికి వెళ్తున్న వినుకొండ వాసి వేముల శ్రీనివాస్ వాహనాన్ని రవాణా శాఖ అధికారులు బలవంతంగా తీసుకు వెళ్ళడం , అదీ భార్యా, పిల్లలతో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డున దింపేసే హక్కు ఈ అధికారులకు ఎవరిచ్చారు? అని ప్ర‌శ్నించారు.. సీఎం కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలేని స్థితికి రాష్ట్రం ఎందుకు వెళ్ళిందా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వ అధికారులే ఇలాంటి చర్యలకు పాల్పడడం ద్వారా ప్రజలకు ఏమి చెప్పాలి అనుకుంటున్నారని మండిప‌డ్డారు. సిఎం వస్తే షాప్స్ మూసెయ్యడం.... సిఎం కాన్వాయ్ కోసం వాహనదారుల కార్లు లాక్కెళ్ళడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. ఈ ఘ‌ట‌న‌పై సీఎం జ‌గ‌న్ కూడా సీరియ‌స్ గా తీసుకున్నారు. సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎంఓ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సహించబోమంటూ గట్టి సంకేతాలు ఇవ్వాలన్నారు. అందుకు అనుగుణంగా బ‌ల‌వంతంగా కారు లాక్కెళ్లిన హోం గార్డుతో పాటు ఏఎంవీఐ వి. సంధ్య‌ను స‌స్పెండ్ చేశారు.

Next Story
Share it