జగన్ తప్ప అందరూ పోరాడుతున్నారు
తమ హక్కుల సాధన కోసం పలు రాష్ట్రాలు కేంద్రంతో పోరాడుతున్నాయని..ఏపీ సీఎం జగన్ మాత్రం మౌనంగా ఉన్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో జగన్, వైసీపీ ఎంపీలు ఏ మాత్రం పోరాటం చేయటంలేదన్నారు. వాళ్లు గట్టిగా ప్రయత్నిస్తే పలితం ఉంటుందని తెలిపారు. రామ్మోహన్ నాయుడు సోమవారం నాడు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అజెండాలో ప్రత్యేక హోదా అంశం పెడితే వైసీపీ తమ గొప్పతనం అన్నట్టు హంగామా చేశారన్నారు. గంటల వ్యవధిలో కేంద్రం హోదాను అజెండా నుంచి తీసేసిందని తెలిపారు.
వైసీపీ ఎంపీలు కేంద్రంపై ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. స్టాలిన్, కేసీఆర్, మమతలు కేంద్రంపై పోరాడుతున్నారన్నారు. జగన్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారని నిలదీశారు. జగన్ పులకేసి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సినిమా టికెట్ల వ్యవహారంలో సమస్య సృష్టించి హీరోలతో పొగిడించుకుంటున్నారని... జగన్ సినిమా నటుల్ని మించి నటన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్ నటన చూసి ఇండస్ట్రీ దండం పెడుతోందన్నారు. ప్రత్యేక హోదాపై వైసీపీ కి చిత్తశుద్ధి ఉంటే ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామాలకు టీడీపీ సిద్ధంగా ఉందని ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.