కూటమి పెద్దలకు ముందే తెలుసా!
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం. వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ఒకప్పుడు ఎంతో సన్నిహితుడుగా ఉన్న మాజీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి బీజేపీ లో చేరిక ముహూర్తం ఖరారు అయింది. కొద్ది రోజుల క్రితమే విజయసాయిరెడ్డి మూడు సంవత్సరాలకు పైనా ఉన్న రాజ్య సభ సభ్యత్వానికి రాజీనామా చేయటంతో పాటు వైసీపీ కి కూడా గుడ్ బై చెప్పారు. అప్పటిలో ఇదే పెద్ద సంచలనంగా మారింది. ఇక రాజకీయాలకు తనకు సంబంధము లేదు అని...తనకు ఎంతో ఇష్టమైన వ్యవసాయం చేసుకుంటాను అంటూ సంచలన ప్రకటన చేశారు. చెప్పినట్లే వ్యవసాయ క్షేత్రంలో ఫోటో లు దిగి కూడా సోషల్ మీడియా లో షేర్ చేశారు. కానీ ఇటీవలే విజయసాయి రెడ్డి హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఉప రాష్ట్రపతి జగదేవ్ ధన్ కర్ స్వాగత కార్యక్రమంలో ప్రముఖంగా పాల్గొని అందరిని ఆశ్చర్యపరిచారు. ఉప రాష్ట్రపతి కూడా సిట్టింగ్ ఎంపీల కంటే ఆయనకే ప్రాధాన్యత ఇవ్వటం హాట్ టాపిక్ గా మారింది. దీంతో విజయసాయిరెడ్డి మళ్ళీ యాక్టీవ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఉంది అనే చర్చ కూడా ప్రారంభం అయింది. ఈ సమయంలో అత్యంత ఆసక్తికరం సమాచారం వస్తోంది. ఇప్పటికే ఆయన బీజేపీ లో చేరే ముహూర్తం ఖరారు అయింది అని....జూన్ లేదా జులై లో విజయసాయిరెడ్డి బీజేపీ లో చేరే అవకాశం ఉంది అని అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
వైసీపీ లో ఉన్నప్పుడు కూడా విజయసాయిరెడ్డి కి అటు ప్రధాని మోడీ తో పాటు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ కి దూరం అయినా విజయసాయి రెడ్డి బీజేపీ లో చేరితే రాజకీయంగా జగన్ కు మరిన్ని చిక్కులు తప్పని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే రకరకాల కారణాలతో బీజేపీ ప్రస్తుతం జగన్ ను దూరం పెడుతోంది. ఈ తరుణం లో విజయసాయిరెడ్డి బీజేపీ లో చేరితే ఈ రెండు పార్టీల మధ్య దూరం మరింత పెరిగే అవకాశం ఉంది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
ఇందులో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించే అవకాశం కూడా లేకపోలేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విజయసాయిరెడ్డి బీజేపీ లో చేరితే ఆయన గతంలో ప్రకటించినట్లు సొంత ఛానెల్ పెట్టే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టే అవకాశం ఉంది అనే అభిప్రాయం ఆయన సన్నిహిత వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. విజయసాయిరెడ్డి జనంలో పట్టు ఉన్న నాయకుడు ఏమీ కాకపోయినా తెరవెనక రాజకీయాలు చేయటంలో కీలక పాత్ర పోషిస్తారు అనే ప్రచారం ఉంది. అయితే విజయసాయిరెడ్డి బీజేపీ లో చేరే విషయం ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి సర్కారు పెద్దలకు తెలుసు అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది.