Telugu Gateway
Andhra Pradesh

పొత్తు ఫిక్స్..ఇక తేలాల్సింది ఆ లెక్కలే!

పొత్తు ఫిక్స్..ఇక తేలాల్సింది ఆ లెక్కలే!
X

ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట ఎంపీగా బరిలో నిలవబోతున్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ ల పొత్తు ఖరారు అయిపోయింది. ఇక మిగిలింది కేవలం సీట్ల సంఖ్య...ఏ సీట్లు ఎవరికీ అన్న విషయం మాత్రమే తేలాలి. పొత్తులో భాగంగా బీజేపీ ఆయన్ను రాజంపేట ఎంపీ బరిలో దింపే అవకాశం ఉంది అని చెపుతున్నారు. బీజేపీ రాజంపేట తో పాటు తిరుపతి, రాజమండ్రి తదితర లోక్ సభ సీట్లు అడుగుతోంది. గత ఏడాది కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ లో చేరిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరు నాటికి మూడు పార్టీల మధ్య పొత్తు ఖరారుతో పాటు ఎవరెవరికి ఎన్ని సీట్లు..ఏయే సీట్లు అన్న విషయం ఖరారు అవుతుంది అని టీడీపీ వర్గాలు తెలిపాయి. కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి బీజేపీ కీలక నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చర్చలు జరిపి వచ్చిన విషయం తెలిసిందే.

ఈ వారంలో మరో సారి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల ఢిల్లీ టూర్ ఉండే అవకాశం ఉంది అని ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. టీడీపీ లో చాలా మంది నేతలకు బీజేపీ తో పొత్తు ఏ మాత్రం ఇష్టం లేకపోయినా కలిసి ముందుకు వెళ్ళటానికే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు చెపుతున్నారు. సీట్ల కేటాయింపుకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఆధారంగానే ఏ పార్టీ కి ఏ సీటు అనే విషయంపై నిర్ణయం ఉంటుంది అని టీడీపీ నేత ఒకరు వెల్లడించారు. పొత్తులో భాగంగా తెలుగు దేశం పార్టీ ఎన్ని లోక్ సభ, ఎన్ని ఎమ్మెల్యే సీట్లు భాగస్వాములకు కేటాయించాల్సి వస్తుంది...ఆయా నియోజక వర్గాల నేతలను ఆ పార్టీ ఎలా సర్దిచెపుతుందో వేచిచూడాల్సిందే. పొత్తు సాఫీగా ముందుకు సాగేలా చూడటంతో పాటు సీటు దక్కని అసంతృప్తి నేతలను బుజ్జగించటం టీడీపీ కి పెద్ద టాస్క్ కాబోతోంది.

Next Story
Share it